Chandrababu: జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలను ఆపండి: ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ఏపీలో రాజకీయ హింసను అరికట్టేందుకు ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ హింసను పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు

Chandrababu: ఏపీలో రాజకీయ హింసను అరికట్టేందుకు ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ హింసను పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు. మరో 50 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోవాల్సి వస్తోందని, అధికారం పోతుందన్న భయంతో రాజకీయ హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు.

వైఎస్సార్సీపీ గూండాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. గత రెండు రోజులుగా ఇద్దరు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురైన విషయాన్నిప్రస్తావించారు. ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన ప్రజా గళం సభకు హాజరైనందుకు గిద్దలూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని గడికోటకు చెందిన మూలయ్యను దారుణంగా నరికి చంపగా, ఆళ్లగడ్డ సెగ్మెంట్‌లోని చాగలమర్రికి చెందిన 21 ఏళ్ల ఇమామ్ హుస్సేన్ కూడా నిర్దాక్షిణ్యంగా హత్యకు గురయ్యాడని, అలాగే మాచర్లలో టీడీపీ కార్యకర్తల కారుకు నిప్పు పెట్టారని ఆరోపించారు చంద్రబాబు.

పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఈ మూడు ఘటనలకు బాధ్యులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. వైఎస్సార్సీపీ చేస్తున్న హత్యలు, ఫ్యాక్షన్ రాజకీయాలను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన చంద్రబాబు, ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లు (ఎస్పీలు) అందరూ అధికార యంత్రాంగం పాటలకు డ్యాన్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎస్పీల మద్దతును సద్వినియోగం చేసుకుని వైఎస్సార్‌సీపీ గూండాలు తమ తమ ప్రాంతాల్లో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున రాష్ట్రంలో నెలకొని ఉన్న శాంతిభద్రతలపై ఎన్నికల సంఘం తక్షణమే దృష్టి సారించాలని, రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ హింసను సమీక్షించి తక్షణ చర్యలు తీసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఇదిలా ఉండగా.. 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు మే 13న ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: Anupama: ఆ క్యారెక్టర్లు చేసి బోర్ కొడుతుంది.. అందుకే బోల్డ్ గా నటించా: అనుపమ