వైసీపీ ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చెరుకూరులో తుఫాన్ తో దెబ్బతిన్న పంటపొలాలు చంద్రబాబు నాయుడు పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ను ఎవరూ కంట్రోల్ చేయలేరు.. కానీ తుపాన్ తో జరిగే నష్టాన్ని తగ్గించే బాధ్యత ప్రభుత్వానిదేనని చంద్రబాబు అన్నారు. హుదూద్ తుఫాన్ సమయంలో వారం రోజుల పాటు బస్సులోనే ఉండి పరిస్ధితి మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు తాను అక్కడే ఉన్నానని చంద్రబాబు గుర్తు చేశారు. నాలుగున్నరేళ్ల నుంచి ఎక్కడైనా పంట కాలువల్లో పూడిక తీశారా? డ్రెయిన్లు శుభ్రం చేశారా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తుఫాన్ వస్తుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని.. కనీసం గోతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎంకు రైతుల భాధలు ఏం తెలుసన్నారు. నిన్న ఒక్క రోజునే రాష్ట్రంలో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. దీనికి కారణం సీఎం జగన్‌మోహన్ రెడ్డేనని చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తి చేసి ఆ నీళ్ళు కృష్ణా డెల్టాకు తీసుకురావాలని.. ఇది పూర్తయితే నీటి సమస్య ఉండదన్నారు. టీడీపీ హయాంలో పట్టిసీమ నిర్మించి జూలైలోనే నీళ్లిచ్చి పంట పొలాల్ని సస్యశ్యామలం చేశామన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
పర్చూరు నియోజకవర్గంలో లక్ష ఎకరాల్లో పంట సాగు చేస్తే.. 90 శాతం నష్టం జరిగిందన్నారు. పొగాకు పంటకు ఎకరా రూ. 50 వేలు, శనగకు రూ. 30 వేలు, పత్తికి రూ. 50 వేలు ఖర్చు చేసి రైతులు నష్టపోయారని చంద్రబాబు తెలిపారు. వరికి హెక్టారుకు రూ.30వేలు, ఆక్వాకు రూ.50వేలు, మరణించిన వారి కుటుంబానికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు సాయం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇల్లు కోల్పోతే రూ. లక్ష ఇచ్చి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని.. దెబ్బతిన్న ఇంటికి రూ.20 వేలు, పశువుల షెడ్డుకు రూ. 20వేలు ఇవ్వాలన్నారు. అరటికి రూ.40వేలు, పత్తికి రూ. 25వేలు, మిరపకు రూ.50వేలు, వేరుసెనగకు రూ.25 వేలు, మొక్కజొన్నకు రూ.15 వేలు, వీధి వ్యాపారులకు రూ.10వేలు పరిహారం ఇవ్వాలన్నారు. ఇంతవరకు ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందో ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవని… తుఫాన్ నష్టంపై అద్యయనానికి కేంద్ర బృందాన్ని ఎందుకు పిలవలేదని చంద్రబాబు ప్రశ్నించారు.
Also Read: Pawan Kalyan – Barrelakka : పవన్ కళ్యాణ్ ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బర్రెలక్క