Site icon HashtagU Telugu

Chandrababu: ఒకే ఒక్క‌డు! ఒంట‌రి పోరాటం!!

CBN TDP

Chandrababu Tdp

యుద్ధానికి ఒక ప్ర‌క్రియ‌, నీతి ఉన్న‌ట్టే రాజ‌కీయానికి కూడా వ్యూహం ఉండాలి. రాజు యుద్ధ భూమిలోకి ఎప్పుడు రావాలి? వ్యూహాలు ర‌చించ‌డానికి మంత్రి, సైన్యాన్ని క‌దిలించ‌డానికి సేనాధిప‌తులు, క్షేత్ర స్థాయిలో పోరాడే సైన్యం ఇలా ఒక ప్ర‌క్రియ ఉంటుంది. ఏ యుద్ధంలోనూ రాజు ముందుగా బ‌య‌ట‌కు రాడు. కానీ, రాజ‌కీయ యుద్ధానికి తానే రాజు తాను మంత్రి అన్న‌ట్టు చంద్ర‌బాబు క‌నిపిస్తున్నారు. ఇదే టీడీపీకి పెద్ద మైన‌స్ పాయింట్ గా ఉంద‌ని ఆ పార్టీలోని కొంద‌రు వాద‌న‌. 40 ఏళ్ల చంద్ర‌బాబు రాజ‌కీయ క‌ద‌లిక‌ల‌ను బేరీజు వేసుకుంటే ఎప్పుడూ ఆయ‌న ఒంట‌రి పోరాటాన్ని న‌మ్ముకున్నార‌ని అర్థం అవుతుంది.

ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత ఏ ఒక్క ఎన్నిక కోసం  జగన్ మోహన్ రెడ్డి బ‌య‌ట‌కు రాలేదు. తెలంగాణ సీఎం దాదాపుగా ఫౌంహౌస్ నుంచే ఎనిమిదేళ్లుగా పాల‌న సాగిస్తున్నారు. కానీ, చంద్ర‌బాబు మాత్రం అధికారంలో ఉంటే టంచ‌న్ గా రివ్యూ మీటింగ్ లు పెడుతూ ఉద్యోగుల వెంట‌పడుతుంటారు. ప్ర‌తిప‌క్షం నాయ‌కునిగా ప్ర‌జ‌ల్లో ఉండాలని త‌ప‌న ప‌డుతుంటారు. ఫ‌లితంగా ఆయ‌న‌కు, లీడ‌ర్ల‌కు మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింది. అలాగే లీడ‌ర్లు, క్యాడ‌ర్ కు అంత‌రం ఉంది. ఇదే ఇప్పుడు టీడీపీ పోరాటాల‌ను విజ‌య‌వంతం చేయ‌లేని ప‌రిస్థితుల్లోకి నెట్టింద‌ని ఆ పార్టీ సీనియ‌ర్లు ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో చ‌ర్చించుకుంటున్నారు.

Also Read:   Pawan Die Hard Fans: అభిమాని కోరిక నెరవేర్చిన పవన్

ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన త‌రువాత చంద్ర‌బాబు ఇచ్చిన ప్రోగ్రామ్ ల‌ను విజ‌య‌వంతం చేయ‌డంలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఇంచార్జిలు ఫెయిల్ అయ్యారు. కొంద‌రు కేంద్ర కార్యాల‌యం పిలుపునిస్తే క్షేత్ర‌స్థాయికి వ‌స్తున్నారు. మోజార్టీ లీడ‌ర్లు పార్టీలో ఉన్నారా? లేరా? అనే రీతిలో ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు మొన్న‌టి వ‌ర‌కు మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు పార్టీ ఉన్నారా? లేదా ? అనే సందేహం క‌లిగేలా తెర‌చాటుకు వెళ్లారు. అలాగే, మాజీ మంత్రి నారాయ‌ణ ఇప్ప‌టికీ ఎక్క‌డా క‌నిపించ‌రు. ఇంకో మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు పొలిటిక‌ల్ సీన్లో ఉన్నారా? అనే సందేహం క‌లుగుతోంది. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి క‌ర్నూలు రాజ‌కీయానికి దాదాపుగా దూరంగా ఉన్నారు. ఇలా ప్ర‌తి చోటా యుద్ధంలో మంత్రుల మాదిరిగా ప‌నిచేయాల్సిన మాజీ మంత్రులు చంద్ర‌బాబు పిలుపుకు ముందుకు రావ‌డంలేదు.

ఉత్త‌రాంధ్రకు సంబంధించి రిషికొండ‌, గంజాయి స్మ‌గ్లింగ్, భూ ఆక్ర‌మ‌ణ‌లు త‌దిత‌ర అంశాల‌పై పోరాటం చేయాల‌ని ఈనెల 28వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 3వ తేదీ వ‌ర‌కు చంద్ర‌బాబు షెడ్యూల్ ఇచ్చారు. తొలి రోజు మాత్ర‌మే కొంత హ‌డావుడి చేసిన లీడ‌ర్లు ఆ త‌రువాత నిమ్మ‌కుండిపోయారు. ఇక క్యాడ‌ర్ ఎక్క‌డా రోడ్ల మీద‌కు రావ‌డానికి సాహ‌సించ‌డంలేదు. ఇలాంటి ప‌రిస్థితి ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల టీడీపీని వెంటాడుతోంది. మినీ మ‌హానాడులు కొన్ని జిల్లాల్లో పెట్టుకున్న చంద్ర‌బాబు మిగిలిన జిల్లాల‌కు వెళ్ల‌డానికి ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌డంలేదు. ప్ర‌జా ఉద్య‌మాన్ని తీసుకు రావడానికి చంద్ర‌బాబు వ్యూహాల‌ను ర‌చించారు. కానీ, వాటిని అమ‌లు చేయాల్సిన సేనాధిప‌తులు లాంటి నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిలు చురుగ్గా ముందుకు రావ‌డంలేదు. ఫ‌లితంగా క్యాడ‌ర్ కూడా ఉత్సాహంగా ముందుకు దూక‌డానికి వెనుకాడుతోంది. కేవలం టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు మాత్ర‌మే ఒంటరి పోరాటం చేయాల్సిన ప‌రిస్థితి రావ‌డం పార్టీని న‌డ‌ప‌డంలో ఆయ‌న తప్పు చేస్తున్నారా? లేక లీడ‌ర్ల‌ను ఎంపిక చేసుకోవ‌డంలో రాంగ్ చేశారా? ప్ర‌తిదానికి ఆయ‌నే ముందుకు రావ‌డం త‌ప్పా? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోన్న అంత‌ర్గత చ‌ర్చ.

Also Read:   Himachal Pradesh: తనకు టికెట్ ఇవ్వలేదని వేదికపై విలపించిన మాజీ ఎంపీ… ఓదార్చిన జేపీ నడ్డా..!!