Balineni resignation from YCP : వైసీపీకి ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. నిన్న జగన్‌తో సమావేశమయ్యి జరిపిన చర్చలు విఫలమయ్యాయంటూ వార్తలు వినిపిస్తాయి. దీంతో ఆయన సమావేశం మధ్యలోనే అసంతృప్తితో బయటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వైసీపీ తనకు సహకరించడంలేదని బాలినేని చెబుతున్నారు. ఈవీఎంలపై తాను చేస్తోన్న పోరాటానికి పార్టీ సహకరించడంలేదని జగన్‌ను అడిగారు బాలినేని. దీంతో పార్టీకి రాజీనామా చేస్తానని పార్టీ అధినేత జగన్‌తో చెప్పినట్లు సమాచారం. నేడో, రేపో పార్టీకి బాలినేని గుడ్ బై చెబుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఆ పార్టీలో చేరుతారని ప్రచారం..
ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతలు కూడా ఆయన రాజీనామాపై రకరకాలుగా స్పందిస్తున్నారు. పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకే బాలినేని రాజీనామా డ్రామాలు ఆడుతున్నాడని ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే.. ఏ పార్టీలో చేరతారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బాలినేనికి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన ఆ పార్టీలో చేరుతారని ప్రచారం ఊపందుకుంది. టీడీపీ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావుతో బాలినేని విబేధాలు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలో వెళ్లబోడని తెలుస్తోంది. ఇక పార్టీ మారే విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా, 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి జగన్‌కు మద్దతుగా వైసీపీలో చేరారు బాలినేని. ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. 2019 లో వైసీపీ ప్రభుత్వంలో తొలి రెండున్నర ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రి పదవి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. జగన్ బుజ్జగింపుతో మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆయన రాజీనామా అంశం తెరపైకి వచ్చింది. మరో వైపు బాలినేని వ్యతిరేకులు మాత్రం ఇదంతా పార్టీపై ఒత్తిడి పెంచేందుకు చేస్తున్న డ్రామా అని కొట్టిపారేస్తున్నారు.