Heritage Promise: గత 33 ఏళ్లుగా కోట్లాది కుటుంబాలకు తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులను అందిస్తూ నమ్మకమైన బ్రాండ్‌గా ఎదిగిన హెరిటేజ్ ఫుడ్స్ నాణ్యతపై సంస్థ అధినేత, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక సందేశాన్ని ఇచ్చారు. రూ. 4 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రస్థానం నేడు రూ. 4,000 కోట్ల స్థాయికి చేరినప్పటికీ నాణ్యత విషయంలో ఎన్నడూ రాజీ పడలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రతి ఉత్పత్తి వినియోగదారుడికి చేరే ముందు 25 రకాల కఠినమైన నాణ్యత పరీక్షలను దాటుతుందని, దాదాపు 500 మంది నిపుణులు ఈ ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తారని భువనేశ్వరి పేర్కొన్నారు. తొమ్మిది రాష్ట్రాల్లోని 3 లక్షల మంది పాడి రైతులతో పారదర్శకత, సరైన ధర, సకాలంలో చెల్లింపులు అనే సూత్రాలతో హెరిటేజ్ ముందుకు సాగుతోందని వివరిస్తూ “చూసిందే నమ్మండి” (#HeritagePromise) అని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.
సాక్షి మీడియాకు బిగ్ షాక్
మరోవైపు హెరిటేజ్ ఫుడ్స్‌పై రాజకీయ ప్రేరేపిత నిరాధార ఆరోపణలు చేసిన సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు, బోలేబాబా డెయిరీకి మధ్య సంబంధం ఉందంటూ సాక్షిలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని కోర్టు ప్రాథమికంగా గుర్తించింది. ఈ మేరకు హెరిటేజ్‌పై టెలికాస్ట్ చేసిన అన్ని అసత్య వార్తల లింక్‌లను 24 గంటల్లోగా తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ సాక్షి యాజమాన్యం ఈ లింక్‌లను తొలగించడంలో విఫలమైతే మెటా, గూగుల్, యూట్యూబ్ వంటి సంస్థలు తక్షణమే ఆ కథనాలను తొలగించేలా చర్యలు చేపట్టాలని కోర్టు స్పష్టం చేసింది.
Also Read: ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్రముఖులు!
#HeritagePromise – చూసిందే నమ్మండి
33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం. రూ.4 కోట్లుగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్థగా ఎదిగినా, నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదు.ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు… pic.twitter.com/xan0wUyxz7
— Nara Bhuvaneswari (@ManagingTrustee) February 19, 2026
సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య కథనాలను ప్రసారం చేసినందుకు గానూ సాక్షి మీడియాపై హెరిటేజ్ ఫుడ్స్ రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. ఈ పరిణామాలపై స్పందిస్తూ “వెంకన్న విన్నాడు.. నిజాన్ని గెలిపించాడు” అని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నిరూపణ లేని వార్తలను ప్రసారం చేయడం సరికాదని, చివరకు న్యాయమే విజయం సాధించిందని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. రైతు సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న తమ సంస్థపై ఇలాంటి కుట్రలు సాగవని హెరిటేజ్ యాజమాన్యం ధీమా వ్యక్తం చేసింది.
