Araku Coffee : ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన నాణ్యమైన అరకు కాఫీకి మరో గుర్తింపు దక్కనుంది. రేపటి (సోమవారం) నుంచి మార్చి 28 వరకు ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో 2 అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంటు ప్రాంగణంలోని సంగం 1, 2 కోర్టు యార్డ్ వద్ద ఈ స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించాలనే గొప్ప లక్ష్యంతో ఈ అవకాశాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కల్పించారు. ఈమేరకు అనుమతులతో లోక్‌సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (GCC) ఆధ్వర్యంలో అరకు వ్యాలీ కాఫీ స్టాల్స్‌ను పార్లమెంటులో ఏర్పాటు చేస్తారు. ఈ స్టాల్స్‌ను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఇతర కేంద్ర మంత్రులు ప్రారంభిస్తారు. లోక్ సభ,రాజ్యసభ ఎంపీలంతా అరకు వ్యాలీ కాఫీ స్టాల్స్ వద్దకు విచ్చేసి ఆర్గానిక్ కాఫీని రుచి చూడాలని జీసీసీ కోరింది. ఇటీవలే ఏపీ అసెంబ్లీలోనూ అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర గిరిజనులు పండించిన అరకు కాఫీ అసెంబ్లీ సాక్షిగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గిరిజనులు సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేయడమే ఈ కాఫీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.
Also Read :TTD Update: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు.. టీటీడీ కీలక అప్‌డేట్
నంబర్ 2 ఏపీ.. మోడీ సైతం..
మన దేశంలో కాఫీ(Araku Coffee) సాగులో నంబర్ 1 రాష్ట్రం కర్ణాటక. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. గిరిజన రైతులు రసాయన, ఆధునిక పద్ధతులకు దూరంగా వాటిని పండిస్తుండడంతో మార్కెట్‌లో అరకు కాఫీ గింజలకు గిరాకీ ఏర్పడింది. గతేడాది జూలైలో నిర్వహించిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ‘అరకు కాఫీ’ గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు. నాణ్యతలో అరకు కాఫీ చాలా ఫేమస్ అని ఆయన చెప్పారు. దీంతో అప్పట్లో అరకు కాఫీ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.
Also Read :Sushant Rajput: మిస్టరీగా సుశాంత్‌సింగ్ మరణం.. సీబీఐ కేసులు క్లోజ్
ఏపీలో కాఫీ తోటల సాగు పెరిగింది ఇలా..
- ఏపీలోని గిరిజనులు పోడు వ్యవసాయం చేయకుండా నిలువరించేందుకు, 1989లో కాఫీ సాగును నాటి రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పరిచయం చేసింది.
- ఏపీలో 1989 నుంచి 2002 వరకు సగటున 32,072 ఎకరాల్లో కాఫీ తోటలు వేశారు.
- 2003 నుంచి 2008 వరకు 64,265 ఎకరాల్లో కాఫీ తోటలు వేశారు.
- 2009లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కాఫీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి.
- 2009 నుంచి 2016 వరకు 61,684 ఎకరాల్లో, 2016 నుంచి 2024 వరకు 84 వేల ఎకరాల్లో కాఫీ తోటలు వేశారు.
- 1989 నుంచి 2024 వరకు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతం వ్యాప్తంగా 2 లక్షల 42 వేల 21 ఎకరాలకు కాఫీ తోటలు విస్తరించాయి. వీటి ద్వారా 2 లక్షల 36 వేల 618 మంది గిరిజన కాఫీ రైతులు లబ్ధి పొందుతున్నారు.
- ఏడాది కాలంలో ఒక ఎకరం కాఫీ తోటతో సుమారుగా రూ.50 నుంచి రూ.60 వేల ఆదాయం సమకూరుతుంది.