Indiramma Abhayam Scheme : ఏపీలో కాంగ్రెస్ ప్రకటించిన తొలి హామీ ఇదే..

  • Written By:
  • Publish Date - February 26, 2024 / 11:51 PM IST

ఏపీలో మళ్లీ కాంగ్రెస్ హావ కనిపిస్తుంది. పదేళ్లుగా కాంగ్రెస్ పేరు ఎత్తని ప్రజలు..ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం తో మళ్లీ కాంగ్రెస్ పేరును ప్రజలు పలుకుతున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) సైతం..దూకుడు కనపరుస్తూ ప్రజల్లో నమ్మకం పెంచుతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడంతో అధికారం దక్కించుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. కాంగ్రెస్ అధిష్టానం సైతం తెలంగాణ లో ఎలాగైతే ఉచిత హామీలతో అధికారం చేపట్టారో..అదే విధంగా ఏపీలోను అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఈరోజు అనంతపురంలో జరిగిన కాంగ్రెస్​ న్యాయ సాధన సభలో మొదటి హామీని షర్మిల ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి నెలా ఐదువేలు ఇస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ అభయం (Indiramma Abhayam Scheme) కింద ఇంటింటికి మహిళల పేరు మీద రూ.5 వేల ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. మహిళల పేరు మీదనే చెక్కు పంపిణీ చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కోసమే ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టా అని ఈ సందర్బంగా షర్మిల చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు , జగన్ ల ఫై తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణం ఓవైపు చంద్రబాబు అయితే, మరోపక్క వైఎస్ జగన్ అని విమర్శించారు. ఇద్దరూ కలిసి బీజేపీ మెడలు వంచి ఉండి ఉంటే.. ఈపాటికి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చుండేదని అన్నారు. ఊసరవెల్లి కూడా చంద్రబాబు వద్దే రంగులు మార్చడం నేర్చుకుందని వైఎస్ షర్మిల అన్నారు. సీఎం అయ్యాక చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అన్నారని షర్మిల గుర్తు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రత్యేక హోదా రానందునే ఏపీకి పరిశ్రమలు రాలేదు. అందుకే యువతకు ఉద్యోగాలు కూడా రాలేదు. చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరూ బీజేపీతో అంటకాగుతూ… ఆ పార్టీకి బానిసలుగా మారారని విమర్శించారు. బీజేపీకి మనకు ఏం ఇచ్చింది? మనకు ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే.. ఎలా పొత్తులు పెట్టుకున్నా అడిగేవారు కాదు. కానీ, ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తున్నా కూడా ప్రశ్నించకపోగా.. అదే పార్టీతో పొత్తులు పెట్టుకుంటుంటే.. ప్రజలకు ద్రోహం చేస్తున్నట్లు కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని షర్మిల వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాయని షర్మిల ప్రశ్నించారు.

కాంగ్రెస్ పక్షాన ఆందోళన చేస్తుంటే… నన్ను ఈడ్చి పడేశారని అన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం ప్రాజెక్ట్ లో 54 ప్రాజెక్ట్ లు కడితే.. ఐదేళ్లలో జగన్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పక్షాన ప్రశ్నిస్తుంటే చెల్లెలు అని కూడా చూడకుండా తనపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు పోసి సోషల్ మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారని అన్నారు, ‘ఒకప్పుడు ఇదే చెల్లెలు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. రాష్ట్ర హక్కుల కోసం ఇదే చెల్లెలు ఉద్యమం చేసింది.. బై బై బాబు అంటూ ఉద్యమం చేసింది. మీకోసం ఇదే చెల్లెలు ఇంత కష్టం చేస్తే.. నా మీద, నా భర్త మీద నిందలు వేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నదీ దేవుడు చూస్తున్నాడు. ఎన్ని నిందలు వేసినా వైఎస్సార్ బిడ్డ భయపడదు..ఆంధ్ర రాష్ట్ర హక్కులు సాధించే వరకు వైఎస్సార్ బిడ్డ ఇక్కడ నుంచి కదలదు’ అని షర్మిల స్పష్టం చేసారు.

Read Also : Srisailam: శ్రీశైలం భక్తులపై అటవీ శాఖ అధికారుల ఆంక్షలు..