CM Chandrababu: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. భారతదేశం నుంచి అమెరికాకు ఉత్పత్తి అయ్యే దిగుమతులపై 27శాతం సంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ నిర్ణయం పట్ల ఆక్వా ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది. భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలది మూడో స్థానం. ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే సింహభాగం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ట్రంప్ నిర్ణయంతో రొయ్యల సాగు దారులకు నష్టాలు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. తాజాగా విషయంపై వివరిస్తూ కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు.
Also Read: PM Modi: డీఎంకే ప్రభుత్వంపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు.. సంతకమైనా తమిళంలో చేయండంటూ..
భారతదేశం నుంచి వెళ్లే సముద్రపు ఆహార ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం 27 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల విలువైన సముద్రపు ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వీటిలో రొయ్యలే 92 శాతం వాటా కలిగి ఉన్నాయి. అమెరికా దేశానికి రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారత్‌పై 27 శాతం దిగుమతి సుంకం విధించడంతో ఆక్వా రైతాంగం నష్టపోతోంది. ఈక్వెడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10 శాతం పన్ను మాత్రమే విధిస్తోంది అమెరికా. ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ.. వారికి అనుకూలంగా మారుతోంది. దీనికి తోడు మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77 శాతం కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ భారాన్ని మోస్తున్నారు. అన్ని సుంకాలను కలుపుకుంటే ఈక్వెడార్‌కు భారతదేశానికి మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20 శాతం ఉంటోందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
Also Read: BRS Silver Jubilee: బీఆర్ఎస్‌కు మరో షాక్.. రజతోత్సవ సభకు అనుమతి డౌటే ?
సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా యూఎస్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని చంద్రబాబు లేఖలో కేంద్ర మంత్రిని కోరారు. ఏపీ జీడీపీలో మత్స్యరంగం కీలకంగా ఉందన్న చంద్రబాబు.. సంక్షోభ సమయంలో ఆక్వా రైతులకు అండగా ఉండాలని కోరారు. అధిక సుంకాల వల్ల మన ఆర్డర్లను ఇతర దేశాలు రద్దు చేసుకుంటాయని, ఏపీ శీతల గిడ్డంగుల్లోనూ నిల్వ కోసం స్థలం లేదని, ఆక్వా రైతులు గందరగోళంగా ఉన్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు ఇంకా పంట సిద్ధంగా ఉంది. 27శాతం సుంకాల కారణంగా రైతుల నుంచి పంట సేకరించడం ఎగుమతిదారులు నిలిపివేశారు. ఈ పరిణామాలు రాష్ట్ర ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు ఇలా అందరికీ సమస్యలు ఎదురయ్యాయి. సుంకాల నుంచి రొయ్యలను మినహాయింపు జాబితాలో చేర్చేలా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరుతున్నా. సకాలంలో మీరు దీనిపై జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తే ఆక్వాపై ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధిని కాపాడవచ్చు అంటూ లేఖ రాశారు.