ఏపీ రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. ఈరోజు ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కు ఆమోదం లభించింది. రేపు అసెంబ్లీకి సెలవు ఉండనుంది. రేపు ఉ.11 గంటలకు ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు ఉంటాయి. మ.2 గంటలకు కూటమి శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే కూటమి పార్టీల శాసనసభ సభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అందరూ విధిగా హాజరు కావాలని పార్టీ నుంచి ఆదేశాలను జారీచేశారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే . సమావేశాలు ప్రారంభానికి ముందు సీఎం చంద్రబాబు వెంకట పాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వెలగపూడిలో అసెంబ్లీ నిర్మించినప్పటి నుంచి వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం చంద్రబాబు కు ఆనవాయితీ. సమావేశాలు ప్రారంభం కాగానే.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెను ప్రవేశ పెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94లక్షల కోట్లతో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ (AP Budget 2024) ప్రవేశ పెట్టడం జరిగింది.
ఇందులో రెవెన్యూ వ్యయాన్ని 2లక్షల34 వేలకోట్లుగా మూలధన వ్యయాన్ని 32 వేల 712 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 34 వేల 743 కోట్లు, ద్రవ్య లోటు 68 వేల 743 కోట్లుగా ఉండొచ్చని, రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి – జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 4.19 శాతం, ద్రవ్య లోటు 2.12 శాతంగా ఉండొచ్చని వివరించారు. అలాగే ఉన్నత విద్యకు 2వేల 326 కోట్లు, ఆరోగ్యరంగానికి 18 వేల 421 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 16 వేల 739 కోట్ల రూపాయలు , సంక్షేమానికి, అందులో బీసీల సంక్షేమానికి అత్యధికంగా 39వేల 7 కోట్లు కేటాయించారు. ఎస్సీ సంక్షేమానికి 18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7వేల 557 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 4 వేల 376 కోట్లు ప్రతిపాదించారు. మహిళా శిశుసంక్షేమ శాఖకు 4వేల285 కోట్లు దక్కాయి. ఇక కీలకమైన పాఠశాల విద్యాశాఖకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖకు 29 వేల 909 కోట్లు, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధిక కల్పనకు కీలకమైన నైపుణ్యాభివృద్ధి శాఖకు 12 వందల 15 కోట్లు కేటాయించారు.
Read Also : Beauty Tips: ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచే కివి.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!