Anganwadi Jobs in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ సాక్షిగా మంత్రి సంధ్యా రాణి ఈ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,000 ఆయా (అంగన్వాడీ హెల్పర్) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, కేంద్రాల నిర్వహణ మరింత సులభతరం కానుంది.
ICDS బలోపేతం.. పౌష్టికాహార పంపిణీకి పెద్దపీట
రాష్ట్రంలో ప్రస్తుతం 55,746 అంగన్వాడీ కేంద్రాలు, 257 ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా గర్భిణులు, బాలింతలు మరియు ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. గతంతో పోలిస్తే అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వల్ల విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని మంత్రి వివరించారు. ఒకప్పుడు 70 శాతంగా ఉన్న హాజరు, ఇప్పుడు ఏకంగా 96 శాతానికి చేరుకోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తోంది.
త్వరలో నోటిఫికేషన్
ఈ 7,000 పోస్టుల భర్తీకి సంబంధించి విధివిధానాలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అతి త్వరలోనే జిల్లా వారీగా ఖాళీల వివరాలను సేకరించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, అర్హత ప్రాతిపదికన నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలను కేవలం ఆహార పంపిణీ కేంద్రాలుగానే కాకుండా, చిన్నారులకు ప్రాథమిక విద్యా బోధన చేసే ‘ప్రీ-స్కూల్స్’గా తీర్చిదిద్దేందుకు ఈ నియామకాలు దోహదపడనున్నాయి.
