Pawan Kalyan: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సేనలతో పోరాడుతూ వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి జవాను భౌతికకాయానికి అంజలి ఘటించారు. మురళీనాయక్ తల్లిదండ్రులను వారు ఓదార్చారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ చూపిన సాహసాన్ని లోకేశ్, పవన్ ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి సవిత చేతుల మీదుగా రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈరోజు (ఆదివారం) కళ్లితండాలోనే అధికారిక లాంఛనాలతో అమరజవాను మురళీనాయక్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందులో పవన్(Pawan Kalyan), లోకేశ్ కూడా పాల్గొంటారు. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని శనివారం రోజే స్వగ్రామానికి తీసుకొచ్చారు. బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి కల్లితండాకు తీసుకొస్తున్న టైంలో జై జవాన్ జై జవాన్ అంటూ రోడ్డు పొడవునా జనం నివాళులు అర్పించారు.
Also Read :Weekly Horoscope : వారఫలాలు.. మే 12 నుంచి మే 18 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
బాలకృష్ణ ఆర్థిక సాయం
మురళీ నాయక్ కుటుంబానికి నందమూరి బాలకృష్ణ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వారికి తన వంతుగా ఒక నెల జీతాన్ని ఇస్తున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. మే 12న మురళీ నాయక్ స్వగ్రామం కల్లితండాకు బాలయ్య వెళ్లనున్నారు. జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా అమరులైన భారత జవాన్లకు సంఘీభావంగా తన ఒక నెల జీతాన్ని (రూ.2.17 లక్షలను) నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.