CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..అమరావతి అందరిదని.. రాష్ట్రానికి ఆత్మ వంటిదని అన్నారు. అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాజధానిలో రైతులను భాగస్వాములను చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజధాని పునఃనిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి లభించిందన్నారు. సభకు తరలివచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదని సీఎం చంద్రబాబు చెప్పారు.
Read Also: Pahalgam Attack : ప్రధానితో రాజ్‌నాథ్ భేటీ..భద్రతా సన్నద్ధతపై వివరణ
త్వరలోనే 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుడతాం. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా చేపడతాం. విశాఖను ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం అని చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యత తీసుకొని వ్యతిరేక శక్తుల కుట్రలు తిప్పికొట్టాలని చంద్రబాబు సూచించారు. గూగుల్, టాటా వంటి ప్రపంచ దిగ్గజాలతో సాంకేతిక పురోగతులు, వ్యూహాత్మక సహకారాల ద్వారా రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో విశాఖపట్నంలో గణనీయమైన మార్పులను సీఎం చంద్రబాబు అంచనా వేశారు.
మే 2న అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి ఘన స్వాగతం పలకడంతో పాటు సభను విజయవంతం చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయి. రోడ్ల నిర్మాణం జరిగితే రవాణా సౌకర్యం పెరగడంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ ఎన్డీఏ విధానం కాబట్టే 2014 నుంచి కేంద్ర విద్యా సంస్థలు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటు చేశాం. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం. తెలంగాణకు హైదరాబద్, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై రాజధానుల ద్వారా 70 శాతం ఆదాయం వస్తోంది. మనకు కూడా మంచి నగరం ఉంటే రాష్ట్రానికి సమృద్ధిగా ఆదాయం సమకూరుతుందని అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.