Kashmir Offer : ‘‘కనీసం వెయ్యేళ్ల తర్వాతైనా కశ్మీర్ విషయలో పరిష్కారం లభిస్తుందో? లేదో? ఈ విషయంలో పరిష్కారం కోసం రెండు దేశాలతో కలిసి పనిచేస్తా’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి భారత్, పాకిస్తాన్‌లతో కలిసి పనిచేయడానికి తాను రెడీ అన్నారు. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, ఈ వ్యవహారంలో మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని సహించేది లేదని భారత్ ఎల్లప్పుడూ చెబుతుంటుంది. ఈ అంశంపై తాజాగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై భారత్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. భారత్, పాకిస్తాన్‌లు సీజ్‌ఫైర్‌కు అంగీకరించాయని శనివారం మధ్యాహ్నం ప్రకటన చేసిన ట్రంప్.. 6 గంటల తర్వాత కశ్మీరు అంశంపై మరో ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఈమేరకు తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ పోస్టులు పెట్టారు.
త్వరలోనే క్లారిటీ
డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్. భారత్, పాకిస్తాన్(Kashmir Offer) దేశాల డీజీఎంఓలు మే 12న మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి మాట్లాడుకోనున్నారు. ఏదైనా తటస్థ వేదికలో సమావేశమై కశ్మీర్ అంశంపై చర్చించుకునేందుకు భారత్, పాకిస్తాన్‌లు అంగీకరించాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం రోజు ప్రకటించారు. తదుపరిగా జరగనున్న ఈ సమావేశాలు, చర్చలు కీలకంగా మారనున్నాయి. కశ్మీర్ అంశంలో భారత్, పాక్‌లు ఎలా స్పందిస్తాయి ? అనేది ఈ సమావేశాల్లో తెలిసిపోనుంది.
Also Read :Weekly Horoscope : వారఫలాలు.. మే 12 నుంచి మే 18 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
ఉగ్రవాదంపైనే భారత్ ప్రధాన ఫోకస్
కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమని అమెరికా, చైనా, టర్కీ, సౌదీ అరేబియా దేశాలు గతంలోనూ ప్రకటించాయి. అయితే ఆ ప్రతిపాదనలను భారత్ ఎలాంటి సంకోచం లేకుండా తిరస్కరించింది. మూడోదేశం కశ్మీరు అంశం గురించి మాట్లాడొద్దని భారత్ తేల్చి చెప్పింది. పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే) సైతం తమదే అని గత కొన్నేళ్లలో చాలాసార్లు ఎన్‌డీయే సర్కారు పెద్దలు కుండబద్దలు కొట్టారు. అలాంటి వారు కశ్మీరు అంశం విషయంలో రాజీపడే ఛాన్సే లేదు. కశ్మీరులో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సమస్యపై భారత్ ప్రధాన ఫోకస్ పెట్టనుంది. పాక్‌లో ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలను పాకిస్తానే స్వయంగా ఏరిపారేసిన తర్వాతే.. ఆ దేశంతో చర్చలకు భారత్ ఆసక్తి చూపొచ్చు.