Xi Jinping Not Coming : చైనా అధ్యక్షుడు ఎందుకు రావడం లేదు?

చైనా అధ్యక్షుడు Xi Jinping ఈ సమావేశాలకు హాజరుకాకుండా ఇటు భారతదేశానికి అటు పశ్చిమ దేశాలకి ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నట్టు తెలుస్తోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - September 6, 2023 / 12:47 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Why Xi Jinping not coming to India? : జి20 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం సకల సన్నాహాలు చేస్తోంది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఈ సమావేశం తర్వాత దేశంలోపలా వెలుపలా తమ ప్రతిష్ట ఇనుముడిస్తుందని అధికార బిజెపి భావించడం సముచితమే. అయితే ఈ సమావేశానికి రెండు ప్రముఖ అగ్రరాజ్యాల అగ్ర నేతలు హాజరు కావడం లేదున్న మాటే పలు ఊహాగానాలకు, పలు చర్చలకు, ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదు. ఆయన తరుపున రష్యాకు ప్రాతినిధ్యం వహిస్తూ వేరొక బృందం వస్తోంది. అయితే పుతిన్ రాకపోవడానికి కారణం ఒకటి బహిరంగంగా కనిపిస్తోంది. అది ఉక్రెయిన్ యుద్ధ నేరాల విషయంలో పుతిన్ అంతర్జాతీయ కోర్టులో బోనెక్కిన కారణం. అంతర్జాతీయ నేర న్యాయస్థానం పుతిన్ అరెస్టుకు వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పుతిన్ రాకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే చైనా అధ్యక్షుడు జీ జింపింగ్ (Xi Jinping) ఎందుకు రావడం లేదు? ఇదే పెద్ద ప్రశ్న.

భారత్ చైనా సరిహద్దు వివాదం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ వివాదం ఈనాటిది కాదు. ఏనాడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేం. అయితే సరిహద్దు సమస్య పరిష్కారం ఇరుదేశాల మధ్య సామరస్య పూర్వక చర్చలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముడిపడి ఉంటుంది. ఈ విషయంలో భారత్ చైనాలు ఎంత ముందుకు వెళ్లాయో పూర్తి వివరాలు మనకు తెలియవు. చాలా వివరాలు భద్రతా కారణాలతో బయట పెట్టలేమని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటారు. అలాగే సరిహద్దు విషయమై చైనాతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరుగుతున్నట్టు మన వారు చెబుతున్నారు. మరి వాతావరణం మంచిగానే ఉన్నప్పుడు మన దేశం ఆతిథ్యం ఇస్తున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు గైర్హాజరు ఎందుకు అవుతున్నారు అనేదానికి మన వాళ్ళ దగ్గర సమాధానం ఉన్నదా, ఉంటే ఆ విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

మరోపక్క జీ జింపింగ్ భారతదేశానికి రాకపోవడానికి సరైన కారణాన్ని చైనా వర్గాలు వెల్లడించలేదు. జింపింగ్ తరఫున చైనా ప్రధాని నేతృత్వంలో ఒక ప్రతినిధి వర్గం ఈ సమావేశాలకు వస్తుంది. కారణం చెప్పకపోయినా చైనా అధ్యక్షుడు జంపింగ్ (Xi Jinping) ఈ సమావేశాలకు హాజరుకాకుండా ఇటు భారతదేశానికి అటు పశ్చిమ దేశాలకి ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నట్టు తెలుస్తోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. భారత్ చైనా మధ్య వాస్తవాధీన రేఖ(LAC) వద్ద శాంతి పునరుద్ధరణ విషయంలో చైనాకు అభ్యంతరాలు ఉన్నట్టు, ఈ విషయంలో చైనా అధ్యక్షుడు తన అసమ్మతిని ఈ విధంగా తెలియజేస్తున్నట్టు పలువురు భావిస్తున్నారు. అంతేకాదు జీ20 సమావేశం కేవలం దేశాల ఆర్థిక అంశాలకే పరిమితం కావాలి కానీ అది రాజకీయం అవుతుందని జంపింగ్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఉక్రెయిన్ యుద్ధ అంశాన్ని ఈ సమావేశాల్లో చర్చకు తీసుకురావడమే అని కూడా అర్థమవుతుంది.

జీ20 సమావేశాలు విజయవంతం కావాలని, అందుకు తమ మద్దతు భారత్ కు సంపూర్ణంగా ఉంటుందని చైనా అధికార ప్రతినిధి మావోనింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాదు భారత్ చైనాల మధ్య సంబంధాలు స్థిరంగా ఉన్నాయని, అనేక దశల్లో ఈ సంబంధాలను దృఢపరుచుకోవడానికి చర్చలు జరుగుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రకటనలు మామూలే. కానీ వాతావరణం అంతా సజావుగా ఉండి, ఇరుదేశాల మధ్య సంబంధాలు నెలకొని ఉంటే ఇండియా సొంత గడ్డమీద ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు జంపింగ్ () ఎందుకు హాజరుకాకుండా ఉంటారనేదే ప్రశ్న. జంపింగ్ ఇప్పటివరకు జరిగిన జి20 సమావేశాలలో దేనికీ హాజరుకాకుండా లేరు. కోవిడ్ సమయంలో 2021లో సమావేశానికి వర్చువల్ గా ఆయన హాజరయ్యారు. అంతేకాదు ఆగస్టు 24న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి సౌత్ ఆఫ్రికాలో హాజరయ్యారు. మరి ఇప్పుడు ఆయనకు ఏమైందని చైనాకు భారత్ అంబాసిడర్ గా పనిచేసిన అశోక్ కంఠ ప్రకటించిన ఆశ్చర్యం అందరికీ కలిగే ఆశ్చర్యమే.

ఏది ఏమైనప్పటికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా శిఖరాగ్ర సమావేశాన్ని తాము నిర్వహిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలకు, ఈ విషయంలో దేశానికి ఒక స్పష్ఠీకరణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో చైనాతో మనవారు మెతక వైఖరి అవలంబిస్తున్నారని, భారత భూభాగాన్ని చైనా వారికి అప్పనంగా దారాదత్తం చేస్తున్నారని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో చైనా అధ్యక్షుడు (Xi Jinping) మన దేశం రాకుండా ఎగ్గొట్టడానికి కారణాల పట్ల అనేక అనుమానాలు కలగడం సమంజసమే. ఇటు ప్రతిపక్షాల విమర్శలను, అటు ప్రపంచంలో పలు దేశాలలో తలెత్తే అనుమానాలను, చైనా వేలెత్తి చూపించే అంశాలను దృష్టిలో పెట్టుకొని భారత్ పాలకులు అడుగులు వేస్తారని ఆశిద్దాం.

Also Read:  G20 Summit: జీ20 సదస్సు ఎఫెక్ట్.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలపై కూడా ఆంక్షలు..?!