Ahmad Vahidi: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలై దాదాపు వారం రోజులు కావస్తోంది. యుద్ధం తగ్గకపోగా మరింత భీకరంగా మారుతోంది. ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇరాన్ లొంగడానికి సిద్ధంగా లేదు. దీనికి ప్రధాన కారణం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అని భావిస్తున్నారు. దీని బాధ్యతలు ఇప్పుడు బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వాహిదీ (Ahmad Vahidi) చేతుల్లోకి వచ్చాయి. వాహిదీని IRGC కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌గా నియమించారు. వాస్తవానికి ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌లో IRGC చీఫ్ మొహమ్మద్ పాక్‌పుర్‌తో పాటు ఖమేనీని కూడా హతమార్చారు.
ఇరానీ మీడియా కథనాల ప్రకారం.. అహ్మద్ వాహిదీ 1988 నుండి 1997 వరకు ఎలైట్ యూనిట్ అయిన కుద్స్ ఫోర్స్ (IRGC విదేశీ విభాగం) కు నాయకత్వం వహించారు. ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన వ్యూహాల వల్లే అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ప్రభుత్వం యుద్ధంలో మోకరిల్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇరాక్‌కు అమెరికా పూర్తి మద్దతు ఉన్నప్పటికీ వాహిదీ వ్యూహాలు ఫలించాయి.
ఖమేనీ అప్పగించిన బాధ్యతలు
దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ డిసెంబర్ 2025లో వాహిదీని IRGC డిప్యూటీ చీఫ్‌గా నియమించారు. అంతకుముందు ఆయన ఇరాన్ సైన్యంలో డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇస్లామిక్ విప్లవాన్ని రక్షించడమే అత్యంత ముఖ్యమైన విషయమని వాహిదీ పేర్కొన్నారు. ఈ విప్లవం గనుక రాకపోయి ఉంటే ప్రపంచంలో ఇరాన్ జెండా ఎగిరేది కాదని ఆయన అన్నారు.
Also Read: ఇంధన సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన!
ప్రభుత్వంలో మంత్రిగా కూడా..
అహ్మద్ వాహిదీ 2009 నుండి 2013 వరకు అప్పటి అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. దీనికంటే ముందు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రభుత్వంలో హోం మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఆయన సైనిక అధికారిగానే కాకుండా బలమైన వ్యూహకర్తగా, అడ్మినిస్ట్రేటర్‌గా పేరు పొందారు.
అమెరికా కంట్లో నలుసుగా ఎందుకు మారారు?
‘ది న్యూయార్క్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. 1994లో అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఒక యూదు సాంస్కృతిక కేంద్రంలో పేలుడు సంభవించింది. ఇందులో 85 మంది మరణించగా, సుమారు 300 మంది గాయపడ్డారు. ఒక సూసైడ్ బాంబర్ 275 కిలోల పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కును బిల్డింగ్‌లోకి దూసుకుపోనిచ్చాడు. ఈ కేసులో ఐదుగురు ఇరాన్ అధికారులపై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. అందులో వాహిదీ పేరు కూడా ఉంది. అమెరికా ఒత్తిడితోనే అర్జెంటీనా పోలీసులు వాహిదీ పేరును చేర్చారని చెబుతారు. ఎందుకంటే 80వ దశకంలో ఆయన అమెరికాకు వ్యతిరేకంగా ఒక నిఘా ఆపరేషన్ నిర్వహించారు. అప్పటి నుండి ఆయన అమెరికా కంట్లో నలుసుగా మారారు.
2000 సంవత్సరంలో అర్జెంటీనా అధికారుల అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ వాహిదీపై రెడ్ నోటీసు జారీ చేసింది. అయితే ఇరాన్ ఈ నోటీసును నిరాధారమైనదిగా కొట్టిపారేసింది. ఈ దాడితో తమ అధికారులకు ఎలాంటి సంబంధం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
2022లో మహ్సా అమిని మరణం తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలను అణిచివేసే విషయంలో కూడా ఆయన పేరు వినిపించింది. నిరసనకారులపై ప్రాణాంతక చర్యలకు పాల్పడ్డారని పేర్కొంటూ అమెరికా, యూరోపియన్ యూనియన్ వాహిదీపై ఆంక్షలు విధించాయి. తల సరిగ్గా కప్పుకోలేదన్న కారణంతో మహ్సా అమినిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఆమె పోలీస్ కస్టడీలోనే మరణించిన సంగతి తెలిసిందే.
ప్రతీకారం తీర్చుకుంటామని IRGC శపథం
సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత IRGC ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేసింది. ‘అల్ జజీరా’ నివేదిక ప్రకారం.. మధ్యప్రాచ్యంలోని అమెరికాకు చెందిన 27 మిలిటరీ బేస్‌లు, టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై IRGC భారీ దాడులు చేసింది. ఈ దాడుల కమాండ్‌ను అహ్మద్ వాహిదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, అమెరికా స్థావరాలను ఎంచుకుని మరీ లక్ష్యంగా చేసుకుంటున్నారని సమాచారం.
