Site icon HashtagU Telugu

US VS Russia : ఆ దేశానికి ఓడ నిండా ఆయుధాలను పంపిన కిమ్!

Us Vs Russia

Us Vs Russia

US VS Russia : ఇటీవల ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ దాదాపు వారంపాటు రష్యాలో పర్యటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ టూర్ లో ఆయుధాల పరస్పర మార్పిడిపై రష్యా, ఉత్తర కొరియా మధ్య డీల్ కుదిరిందనే వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ఆధారంగా నిలిచే శాటిలైట్ ఫొటోలను అమెరికా వైట్ హౌస్ విడుదల చేసింది. ఉత్తర కొరియా నుంచి రష్యాకు ఆయుధాల సప్లై జరిగిందని నిరూపించేలా తమ వద్ద శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయని ప్రకటించింది.

ఓడ నిండా ఆయుధాలు..

అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఉత్తర కొరియా కొన్ని వారాల కిందటే 1,000 కంటే ఎక్కువ సైనిక పరికరాలు, ఆయుధాల కంటైనర్‌లను రష్యాకు పంపించింది’’ అని  వెల్లడించారు. ఆ రెండు దేశాల మధ్య సైనిక సంబంధాల బలోపేతాన్ని ఆయన ఆందోళనకర పరిణామంగా అభివర్ణించారు. ‘‘ఉత్తర కొరియాలోని ఆయుధ డిపో నుంచి రష్యన్ జెండాతో బయలుదేరిన ఓడ నిండా ఆయుధాలు ఉన్నాయి. ఆ ఓడ రష్యా నైరుతి సరిహద్దు సమీపంలోని సైనిక కేంద్రానికి ఇటీవలే చేరింది’’ అని జాన్ కిర్బీ ఆరోపించారు. సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 1 మధ్య ఈ ఆయుధాల రవాణా జరిగిందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘ఉక్రెయిన్ ప్రజలపై దాడి కోసం రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలను అందించడాన్ని మేం ఖండిస్తున్నాం’’ అని కిర్బీ చెప్పారు. ఈ ఆయుధాలను సప్లై చేసినందుకు ప్రతిగా రష్యా నుంచి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్తర కొరియా పొందే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. దక్షిణ కొరియాలోకి అమెరికా యుద్ధ నౌక ప్రవేశంపై ఉత్తర కొరియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసిన ఒకరోజు తర్వాత.. అమెరికా(US VS Russia)  ఈవివరాలను విడుదల చేసింది.

Also Read: Israel Mossad : దెబ్బతిన్న మొస్సాద్ నిఘా వ్యవస్థ..!