Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు బిగ్ షాకిచ్చాడు. చెప్పినట్లుగానే చైనా వస్తువులపై టారిఫ్ ను భారీగా పెంచాడు. చైనా వస్తువులపై అమెరికా 104శాతం సుంకాలను విధించింది. ఈ సుంకాలు ఏప్రిల్ 9వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని వైట్‌హౌస్ ఒక ప్రకటనను విడుదల చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్, చైనా సహా ప్రపంచంలోని అనేక దేశాలపై ప్రతీకార సుంకాలను విధించాడు. చైనా ఉత్పత్తులపై 34శాతం సుంకాలు విధించారు. ట్రంప్ నిర్ణయంపై చైనా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిగా అమెరికా నుంచి చైనాకు దిగుమతి అవుతున్న వస్తువులపైనా సుంకాలను పెంచింది. 34శాతం ప్రతీకార సుంకాలను విధించింది. దీంతో చైనాతీరుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చైనా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని హెచ్చరించాడు. లేదంటే చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలను పెంచుతామని, ఆ తరువాత చర్చలకు కూడా అనుమతించమని వార్నింగ్ ఇచ్చాడు. అయినా చైనా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. దీంతో అమెరికాకు దిగుమతి అవుతున్న చైనా వస్తువులపై 104శాతం సుంకాలను విధిస్తున్నట్లు వైట్ హౌస్ సెక్రటరీ ప్రకటించారు. పెంచిన సుంకాలు ఏప్రిల్ 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు.
డొనాల్ట్ ట్రంప్ ప్రతీకార సుంకాలపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మార్కెట్లు కుదేలవుతున్నాయి. మరోవైపు ట్రంప్ నిర్ణయాల పట్ల అమెరికాలోని లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో బిలియనీర్, టెస్లా అధినేత, డోజ్ సారథి ఎలాన్ మస్క్ సైతం ట్రంప్ ప్రతీకార సుంకాల నిర్ణయంపై వ్యతిరేక గళం విప్పారు. మరోవైపు.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ రంగంలోకి దిగాడు. చైనా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాన్ని తగ్గించాలంటూ ట్రంప్ వద్ద ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. అయితే, మస్క్ సూచనలను ట్రంప్ పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో తాజాగా.. చైనా ఉత్పత్తులపై 104శాతం ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు వైట్ వైస్ ప్రకటిచింది.