Site icon HashtagU Telugu

Gold Card : అమెరికా పౌరసత్వం కోసం గోల్డ్​ కార్డ్​.. రూ.43 కోట్లు చాలు !

Gold Card Us Immigrants Us Citizenship Donald Trump Us Govt

Gold Card : ‘గోల్డ్​ కార్డ్​’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా పౌరసత్వం కావాలంటే రూ.43 కోట్లు (5 మిలియన్ డాలర్లు) పెట్టి ‘గోల్డ్​ కార్డ్​’‌ను కొనుక్కోవాలని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈబీ-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్​కు ప్రత్యామ్నాయంగా ‘గోల్డ్ కార్డు’ను తీసుకొస్తామని  ట్రంప్ తెలిపారు. గోల్డ్ కార్డు(Gold Card)తో  గ్రీన్ కార్డు తరహా సౌలభ్యాలను పొందొచ్చన్నారు. ఈ కార్డును కొనేసి సంపన్నులు అమెరికాలోకి రావచ్చన్నారు. ఈ కార్డుతో ముడిపడిన పూర్తి వివరాలను రెండు వారాల్లో ప్రకటిస్తామని చెప్పారు. ‘‘వివిధ దేశాలకు చెందిన శ్రీమంతులు  అమెరికాలోకి వచ్చి ఉండొచ్చు. ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చు. ఆ డబ్బుతో అమెరికా ఆర్థిక లోటును పూడ్చుకోవచ్చు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

ఈబీ-5 వీసా అంటే ? 

అమెరికా ప్రభుత్వం చాలా రకాల వీసాలను వలసదారులకు జారీ చేస్తుంటుంది.  వీటిలో ‘ఈబీ-5’ వీసా ఒకటి. అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న వారికి ఈ తరహా వీసాలను జారీ చేస్తారు. దీని ద్వారా పెట్టుబడిదారులు, వారి జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు పిల్లలకు ఈబీ-5 వీసా  జారీ అవుతుంది. వీరంతా అమెరికాలో శాశ్వత నివాసానికి అర్హత సాధిస్తారు. ఈ వీసాను పొందే పెట్టుబడిదారులు అమెరికాకు చెందిన నాన్-టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియా (టీఈఏ) ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అమెరికాకు చెందిన కనీసం 10 మందికి ఫుల్​ టైమ్ జాబ్స్ ఇవ్వాలి. 1990లో ఈబీ-5 వీసాల జారీ ప్రక్రియను మొదలుపెట్టారు.

Also Read :YSRCP : త్వరలోనే వైఎస్సార్ సీపీలోకి మరో కీలక కాంగ్రెస్ నేత

గ్రీన్ కార్డ్ అంటే ? 

గ్రీన్ కార్డ్ అంటే.. అమెరికాలో ఉండేందుకు అనుమతించే శాశ్వత నివాస కార్డు. ఈ కార్డు ఉన్నవాళ్లు అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం చేసుకోవచ్చు. మూడు నుంచి ఐదేళ్ల తర్వాత అమెరికా పౌరసత్వం కోసం అప్లై చేసుకోవచ్చు. అమెరికా పౌరులకు అందే కొన్ని ప్రభుత్వ ప్రయోజనాలు ఈ కార్డుదారులకు కూడా లభిస్తాయి. గ్రీన్ కార్డును మనం సొంతంగా స్పాన్సర్ చేసుకోవచ్చు. అమెరికాలో పౌరసత్వం కలిగిన మన బంధువులు/స్నేహితుల ద్వారా ఈ కార్డును స్పాన్సర్ చేయించుకోవచ్చు. అమెరికా పౌరులను పెళ్లి చేసుకునే వారికి కూడా గ్రీన్ కార్డు ఇస్తారు.