Site icon HashtagU Telugu

Sunita Williams : సునితా విలియమ్స్ సొంతూరు, కెరీర్, వివాహం.. విశేషాలివీ

Sunita Williams Hometown Family Jhulasan Gujarat Nasa Astronaut

Sunita Williams : భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్ 9 నెలల తర్వాత ఎట్టకేలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి భూమిపైకి చేరుకున్నారు. దీంతో గుజరాత్‌లోని ఆమె స్వగ్రామం ఝులాసన్‌లో ప్రజలు సంబురాలు చేసుకున్నారు. దేవుడికి హారతి ఇచ్చి, ప్రార్థనలు చేశారు. ఈసందర్భంగా సునితా విలియమ్స్ స్వగ్రామం, కుటుంబం వివరాలను తెలుసుకుందాం..

సునితా విలియమ్స్ స్వగ్రామం, కుటుంబం గురించి..

  • సునితా విలియమ్స్(Sunita Williams) తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్‌లోని మెహసానా జిల్లా  ఝులాసన్ గ్రామ వాస్తవ్యులు.
  • ఆయన గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి 1957లో వైద్య విద్యలోని ఉన్నతమైన ఎండీ పట్టా పొందారు. అనంతరం అమెరికాకు వలస వెళ్ళారు.
  • దీపక్ పాండ్యా 1957లో అమెరికాకు చేరుకున్నాక.. స్లొవేనియన్-అమెరికన్ ఉర్సులిన్ బోనీ జలోకర్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకున్నారు. వారికి సునితా విలియమ్స్ జన్మించారు.
  • 1965 సెప్టెంబరు 19న  ఒహియో రాష్ట్రంలోని యూక్లిడ్ పట్టణంలో సునిత జన్మించారు. ఆమె పెరిగింది మాత్రం మసాచూసెట్స్‌లోని నీధమ్ పట్టణంలో.
  • అమెరికాలోని ఒహియోలో ఉన్న క్లీవ్ ల్యాండ్ లో మెడిసిన్‌లో ఇంటర్న్ షిప్, రెసిడెన్సీని దీపక పాండ్యా పూర్తి చేశారు.
  • 1964లో కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయంలో అనాటమీ విభాగంలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా దీపక్ పాండ్యా చేరారు.
  • తదుపరిగా అమెరికావ్యాప్తంగా వివిధ ఆస్పత్రులు, రీసెర్చ్ సెంటర్లలో దీపక్ పనిచేశారు.
  • 1995లో ఇంజినీరింగ్‌లో పీజీ చేయడంతో సునితా విలియమ్స్ ఉన్నత విద్యాభ్యాసం ముగిసింది.
  • 1987  నుంచి 1997 వరకు అమెరికా ఆర్మీలోని వివిధ విభాగాల్లో సునితా విలియమ్స్ పనిచేశారు.
  • వ్యోమగాముల శిక్షణ కార్యక్రమానికి 1998 జూన్‌లో సునితా విలియమ్స్‌ను నాసా ఎంపిక చేసింది. శిక్షణ పొందే క్రమంలో దాదాపు 30 వేర్వేరు విమానాల్లో 3వేలకుపైగా గంటల పాటు ఆమె అంతరిక్ష వాతావరణంలో గడిపారు.
  • సునితా విలియమ్స్ వ్యోమగామిగా తొలిసారి 1998 ఆగస్టులో ట్రైనింగ్ పొందడం మొదలుపెట్టారు. జాన్సన్ స్పేస్ సెంటర్‌లో ఆమె శిక్షణ పొందారు.
  • 2017 సంవత్సరంలోనే అమెరికా నేవీ నుంచి సునితా విలియమ్స్ రిటైర్ అయ్యారు.
  • ఇక సునితా విలియమ్స్ టెక్సాస్‌లో ఫెడరల్ మార్షల్‌గా పనిచేస్తున్న మైఖేల్ జె.విలియమ్స్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ హెలికాప్టర్లు నడపడం వచ్చు.
  • సునితా విలియమ్స్,  మైఖేల్ జె.విలియమ్స్‌ దంపతులకు పెళ్లై 20 ఏళ్లు కావస్తున్నా పిల్లలు లేరు.
  • 2024 ఆగస్టులో ది వాల్ స్ట్రీట్ జర్నల్‌కు మైఖేల్ విలియమ్స్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సునితకు  సంతోషకరమైన ప్రదేశం ఏది అని మైఖేల్‌ను ప్రశ్నించగా..  ‘‘సునీతకు అంతరిక్షమే సంతోషకరమైన ప్రదేశం’’ అని ఆయన బదులిచ్చారు.