Biden : ఇండియాలో జీర్ణం కానిది వియత్నాంలో కక్కిన బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పేల్చిన బాంబు విస్పోటనం జీ20 సంబరాల సంతోషం మీద పొగలు పొగలుగా కమ్ముకుంది.

  • Written By:
  • Updated On - September 11, 2023 / 07:38 PM IST

By: డా. ప్రసాదమూర్తి

ఎంతవారలైనా మోడీ ముందు నోరు మూసుకొని పడి ఉండాల్సిందే. జి20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ లో అత్యంత అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. వివిధ దేశాల నాయకులతో వివిధ అంశాలతో పలు దఫాలుగా చర్చలు, సంయుక్త ప్రకటనలు, సంయుక్త నిర్ణయాలు, సంయుక్త ఒప్పందాలు అన్నీ సజావుగా జరిగాయి. పండగ ముగిసిన తర్వాత ప్రపంచానికి తెలియని బండారం ఒకటి ఇప్పుడు బయటపడుతోంది. అదీ అమెరికా వంటి అగ్రరాజ్యాధినేత నోటి నుండి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పేల్చిన బాంబు విస్పోటనం జీ20 సంబరాల సంతోషం మీద పొగలు పొగలుగా కమ్ముకుంది.

అమెరికా అధ్యక్షుడు అంగరంగ వైభవంగా జరుగుతున్న జీ20 సమావేశాలకు చతురంగ బలాలతో, సొంత మీడియా బృందాలతో విచ్చేశారు. సంప్రదాయం ప్రకారం ఒక దేశ అధినేత మరో దేశం వెళ్లినప్పుడు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతిథి మరియు ఆతిథేయ దేశాధినేత ఇద్దరూ కలిసి కాన్ఫరెన్స్ చేస్తారు. కానీ ప్రధాని మోడీ ముందు అలాంటి పప్పులు ఉడకవు. ఆయన దృష్టిలో ప్రెస్ అంటే అతి చులకన. అధికారం చేపట్టిన తర్వాత ఆయన ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లోనూ పాల్గొనలేదు. అయితే ఆయన ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా వైట్ హౌస్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అనివార్యంగా నోరు విప్పాల్సి వచ్చింది. భారతదేశంలో మత స్వేచ్ఛ, పౌర హక్కులు, స్వతంత్ర మీడియా మొదలైన విషయాలు ప్రశ్నలుగా వచ్చాయి. మోడీ తడబాటు ప్రపంచం చూసింది. ఆ ప్రశ్నలు వేసిన వాల్ స్ట్రీట్ జర్నలిస్టు మీద భారతదేశంలో మోడీ బృందం చేసిన భయంకర దాడి మనం మర్చిపోలేం.

ఈ నేపథ్యంలో మన దేశంలో జరిగిన జి20 సమావేశాలకు బైడెన్ (Biden) వచ్చారు. ఇండియాలో స్వతంత్ర మీడియా ఎంతవరకు ఉందో ఆయనకు తెలుసు. అయినా మరి ఇంత ఘనంగా జి20 సమావేశాలు జరుగుతున్నప్పుడు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరగకుండా ఉంటుందా అని ఆయన పాపం అత్యాశపడే ఉంటారు. అందుకే తనతో పాటు తమ దేశపు మీడియాని కూడా తీసుకువచ్చారు. అయితే భారత్ లో ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి మోడీ నో చెప్పారు. దీనికి కారణం, ఇది అనేక దేశాల నాయకులు వస్తున్న సమావేశం కాబట్టి ఇలాంటివి ఇక్కడ కుదరదంటే కుదరదు అని భారత ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఈ విషయం అమెరికా అధ్యక్షుడికి జీర్ణం కాలేదు. కాకపోతే దాన్ని కక్కడానికి ఆయన వియత్నాం వెళ్లాల్సి వచ్చింది.

జీ 20 సమావేశాలు ముగిసిన తక్షణమే ఆయన వియత్నాం వెళ్లారు. అక్కడ ప్రెస్ తో మాట్లాడుతూ తాను మోడీతో అన్న ఒక విషయం గురించి ప్రస్తావించారు. ఒక బలమైన, పరిపూర్ణమైన దేశం నిర్మాణం కావడానికి మానవ హక్కుల పట్ల పాలకులు చూపే శ్రద్ధ, పౌర సమాజం, స్వతంత్ర మీడియా ఎంతో కీలకమైనవి అని తాను ప్రధాని మోడీతో సంభాషణ సందర్భంగా ప్రస్తావించినట్లు బైడెన్ (Biden) చెప్పారు. ఈ ఒక్క మాటతో అసలు జి20 సమావేశాల సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ విషయంలో ఏం జరిగిందో ప్రపంచానికి అర్థమైంది. ఇదే విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు కూడా నిర్ధారించాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి భారత ప్రభుత్వం కుదరదే కుదరదని చెప్పేసినట్లు వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి.

దీంతో ఇండియాలో పత్రికా స్వేచ్ఛ పట్ల పాలకులకు, ముఖ్యంగా ప్రధాని మోడీకి ఎటువంటి అభిప్రాయం ఉందో, పత్రికా స్వేచ్ఛపై ఎలాంటి నిర్బంధాలు ఉన్నాయో ప్రపంచానికి అర్థమైపోయింది. ‘ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చెయ్యను ఎవరినీ చేయనివ్వను’ ఇదే మోడీ మహాసంకల్పం కాబోలు అని అందరికీ అర్థమైంది. ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీతో సహా పలువురు ప్రతిపక్ష నాయకులు అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించారు. ఇక కొద్దో గొప్పో స్వతంత్రంగా వ్యవహరిస్తున్న మీడియా సరే సరి. ఏది ఏమైనా ప్రపంచంలో అమెరికా అంతటి అగ్ర దేశానికి నాయకత్వం వహించే అధ్యక్షుడికే ఇండియాలో ప్రెస్ ముందు నోరు విప్పే అవకాశం దొరకలేదు అంటే ఇండియాలో పత్రికా స్వేచ్ఛ ఎంత గొప్పగా ఉందో మరింత స్పష్టంగా అమెరికా అధ్యక్షుడు నోటి నుంచి ప్రపంచం విన్నది. దటీజ్ మోడీ.. దటీజ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా.

Also Read:  Jr NTR Enter into TDP Party : Jr.ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టే టైం వచ్చిందా..?