Site icon HashtagU Telugu

Israel Vs Gaza : ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణకు అమెరికా ప్రపోజల్.. ఏమిటది ?

Israeli Soldiers

Israel Vs Gaza

Israel Vs Gaza : గతేడాది అక్టోబరు 7 నుంచి ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఎంతగా పాలస్తీనాలోకి చొచ్చుకు  వెళ్లినా ఇజ్రాయెలీ బందీలను హమాస్ మిలిటెంట్ సంస్థ దాచిన ప్రదేశాలను ఇజ్రాయెలీ ఆర్మీ కనుగొనలేకపోయింది. ఎంతోమంది ఇజ్రాయెలీ బందీలు.. ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లోనే ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. గాజాలోని సామాన్య పౌరులపై దాడులను ఆపాలంటూ ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. బ్రిటన్ మినహా చాలా యూరోపియన్ దేశాలు ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించేందుకు రెడీ అవుతున్నాయి.  మరికొన్ని యూరప్ దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా(Israel Vs Gaza) గుర్తించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ పెద్దన్న అమెరికా కీలక ప్రతిపాదన తెరపైకి తెచ్చింది.

We’re now on WhatsApp. Click to Join

మొదటి దశలో ఇలా.. 

ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రపోజల్స్‌పై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. బైడెన్ ప్రతిపాదన ప్రకారం.. ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణ మొత్తం మూడు దశలు ఉంటాయి. మొదటి దశ కాల్పుల విరమణ ఆరు వారాల పాటు అమలులో ఉంటుంది. ఈ వ్యవధిలో గాజాలోని జనావాస ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తిరిగి రావాలి.  ఇదే సమయంలో హమాస్ తమ వద్ద ఉన్న మహిళలు, వృద్ధ ఇజ్రాయెలీ బందీలను విడుదల చేయాలి. ఇజ్రాయెల్ సైతం తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా బందీలను రిలీజ్ చేయాలి. ఈక్రమంలోనే పాలస్తీనా పౌరులు గాజాలలోని తమతమ ఇళ్లకు తిరిగి రావడానికి అనుమతిస్తారు.

రెండోదశలో ఇలా.. 

బైడెన్ ప్రపోజల్ ప్రకారం.. కాల్పుల విరమణ రెండో దశలో ఇజ్రాయెలీ సైనికులు, బందీలను హమాస్ విడుదల చేయాలి. మరోవైపు ఇజ్రాయెల్ దళాలు గాజాను పూర్తిగా ఖాళీ చేయాలి. ఈ ప్రక్రియ ఆరు వారాల పాటు కొనసాగుతుంది.

మూడో దశలో ఇలా.. 

బైడెన్ ప్రపోజల్ ప్రకారం.. కాల్పుల విరమణ మూడో దశలో గాజాలో చనిపోయిన ఇజ్రాయెలీ  బందీల మృతదేహాలను హమాస్ అప్పగించాలి. ఇదే సమయంలో గాజా పునర్నిర్మాణానికి  3 నుంచి 5 సంవత్సరాల ప్రణాళిక అమల్లోకి వస్తుంది. ఈ క్రమంలో హమాస్ మరోసారి నిబంధనలు పాటించడంలో విఫలమైతే ఇజ్రాయెల్ తమ సైనిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించవచ్చు. ఈ ప్రతిపాదనల ఆమోదానికి అమెరికా, ఈజిప్ట్, ఖతర్‌ దేశాలు మధ్యవర్తిత్వం వహించనున్నాయి. కాగా, అమెరికా ప్రతిపాదనలకు ఇజ్రాయెల్, హమాస్ లు అంగీకరించాయి. అయితే దీనిపై అవి అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

Also Read : Salman Khan : సల్మాన్‌ఖాన్ కారుపై కాల్పులకు స్కెచ్.. పాక్ నుంచి తుపాకులు!