Iran: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ప్రపంచానికి చుక్క చమురు కూడా అందకుండా చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. ‘స్ట్రైట్ ఆఫ్ హొర్ముజ్’ దాదాపు మూతపడటంతో ఇంధన సంక్షోభం ముదురుతోంది. తాజాగా ఇరాన్ మరొక కీలకమైన సముద్ర మార్గాన్ని కూడా మూసివేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అరేబియా ద్వీపకల్పానికి సమీపంలో ఉన్న ‘బాబ్-అల్-మందేబ్’ అనే వ్యూహాత్మక జలమార్గాన్ని మూసివేయాలని తెహ్రాన్ (ఇరాన్) ప్రణాళికలు రచిస్తోంది.
దాడులు ఆగకపోతే నౌకలను అడ్డుకుంటాం: ఇరాన్
అమెరికా- ఇజ్రాయెల్ తమపై దాడులు కొనసాగిస్తే, బాబ్-అల్-మందేబ్ గుండా వెళ్లే నౌకల రాకపోకలను నిలిపివేస్తామని ఇరాన్ సంకేతాలు పంపింది. ఒకవేళ అమెరికా తమ కొత్త అత్యున్నత నాయకులను లేదా కీలక అధికారులను లక్ష్యంగా చేసుకుంటే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని ఇరాన్ సైనిక వర్గాల సమాచారం.
ఇరాన్ ఘాటైన హెచ్చరిక
ఇరాన్‌లో యుద్ధం దాదాపు ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా స్పందించాయి. “యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో మేమే నిర్ణయిస్తాం. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆగకపోతే, మా ప్రాంతం నుండి ఒక లీటరు చమురును కూడా బయటకు వెళ్లనివ్వం” అని వారు హెచ్చరించారు.
బాబ్-అల్-మందేబ్ ఎందుకు కీలకం?
బాబ్-అల్-మందేబ్ అనేది ఎర్ర సముద్రాన్ని, ఏడెన్ గల్ఫ్ తో కలిపే అతి ముఖ్యమైన సముద్ర మార్గం. ఇది సూయజ్ కెనాల్ ద్వారా మధ్యధరా సముద్రాన్ని, హిందూ మహాసముద్రాన్ని అనుసంధానించే ప్రధాన మార్గం. ఇది యెమెన్, జిబౌటి మధ్య ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాలలో ఒకటి.
Also Read: మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే లక్షణాలు?!
హొర్ముజ్ తర్వాత పెరిగిన సంక్షోభం
ఇప్పటికే ‘స్ట్రైట్ ఆఫ్ హొర్ముజ్’ దాదాపు మూతపడటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% (ప్రతిరోజూ సుమారు 1.5 కోట్ల బ్యారెల్స్) ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. ఈ మార్గం మూతపడటం వల్ల ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది.
చమురు ధరల్లో భారీ పెరుగుదల
ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. సోమవారం ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకానొక దశలో బ్యారెల్‌కు 119.50 డాలర్ల వరకు చేరుకుంది.
ఉత్పత్తి- ఎగుమతులపై ప్రభావం
ఈ మార్గాల ద్వారా సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ తమ చమురు, గ్యాస్‌ను ఎగుమతి చేస్తాయి. సరఫరా ఆగిపోవడంతో ఇరాక్, కువైట్, యుఎఇ తమ చమురు ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది. ఇంధన ధరలు పెరగడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడి, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
