Site icon HashtagU Telugu

Canada : అసలు కెనడాలో ఏం జరుగుతోంది?

What Happening In Canada

What Happening In Canada

By: డా. ప్రసాదమూర్తి

కెనడా (Canada)లో జరుగుతున్న సిక్కు వేర్పాటు వాదుల హత్యలు చూస్తుంటే ఎప్పుడో అంతమైందనుకున్న ఖలిస్తానీ వేర్పాటు ఉద్యమం పూర్తిగా మటుమాయం కాలేదని అర్థమవుతోంది. ఇప్పటికే కెనడా పౌరసత్వం పొందిన ఖలిస్తానీ వేర్పాటు వాది హర్ దీప్ సింగ్ నిజ్జార్ హత్య విషయంలో కెనడా, భారత్ ల మధ్య ఎంత దౌత్య పరమైన యుద్ధం జరుగుతుందో మనకు తెలుసు. ఈ నేపథ్యంలో మరొక సిక్కు యువకుడు కెనడాలో హత్యకు గురైనట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని కెనడా పోలీసులు (Canada Police) ధృవపరిచనట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని కెనడా ప్రభుత్వం (Canada Government) ఇంత వరకూ అధికారికంగా ధృవీకరించ లేదు. అయినా ఆ దేశ పోలీసులు, మన పోలీసులు కూడా దీన్ని ధృవపరిచారంటే అది నిజమేనని నమ్మాలి. హత్యకు గురైన సిక్కు యువకుడి పేరు సుఖ్ దూల్ సింగ్ గిల్. ఇతను పంజాబ్ లోని మోగా జిల్లాకు చెందిన వాడు. కెనడాలోని మానిటోబా రాజధాని విన్నిపెగ్ లో ఇతని హత్య జరిగినట్టు అక్కడి పోలీసులు చెప్తున్నారు. విన్నిపెగ్ పోలీసులు ఈ రోజు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని ధృవపరిచారు.

కెనడా (Canada )లో జరిగిన ఈ రెండో హత్య కెనడా భారత్ పై చేస్తున్న ఆరపణలను బలపరిచేలా ఉన్నాయి. అయితే హత్యకు గురైన 39 సంవత్సరాల యువకుడు గిల్ ట్రాక్ రికార్డు చూస్తే అతను ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్ళినట్టు అర్థమవుతోంది. ఇప్పటికే అతనిపైన దాదాపు 16 కేసులున్నాయి. వాటిలో హత్యలూ, హత్యాప్రయత్నాలూ లాంటి కేసులు ఎక్కువే ఉన్నాయి. అతను పంజాబ్ లో ఒక ట్రక్కు డ్రైవర్ కుమారుడు. తండ్రిని ఖిలిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారు. మానవీయ దృక్పథంతో కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. ఒక ప్యూన్ గా ఉద్యోగం చేస్తున్న అతను ఉగ్రవాద కార్యకలాపాల వైపు మొగ్గినట్టు పోలీసులు చెప్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ అతని పేరును ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2017 లో గిల్ తప్పుడు పాస్ పోర్టు ఆధారంగా కెనడా చేరుకున్నాడు. పంజాబ్, హర్యానా,ఢిల్లీ, రాజస్థాన్ లలో ఘోర నేరాలకు పాల్పడే దేవేందర్ బాంబీహా గ్యాంగ్ లో అతను చేరాడు. అంతే కాదు, అతను ఖలిస్తానీ గ్యాంగ్ స్టర్ అర్షదీప్ సింగ్ దల్లాతో సన్నిహిత సంబంధాలు కూడా నెరపినట్టు తెలుస్తోంది. అతని హత్యను మోగా పోలీసులు కూడా ధృవీకరిస్తున్నారు.

Read Also : Kumari Srimathi Trailer : అబ్దుల్ కలాం.. రజినికాంత్.. ఇటికెలపూడి శ్రీమతి..!

ఇప్పటికే కెనడా భారత్ ల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణానికి ఇది మరింత ఆజ్యం పోసినట్లయింది. కెనడా దీని మీద ఇంకా స్పందించనప్పటికీ, ఈ హత్య విషయంలో కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి మిత్రదేశాలపై మరింత వొత్తిడి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా తదితర కెనడా మిత్ర కూటమి జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా తీసుకుంటున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ రోజు అమెరికా జాతీయ భత్రతా సలహాదారు జేక్ సూలీవాన్, కెనడా భారత్ పై చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. పశ్చిమ దేశాలు ఈ విషయంలో భారత్ కు వ్యతిరేక స్టాండు తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరో పక్క భారత్ రిపబ్లిక్ ఉత్సవాలకు అతిథిగా విచ్చేయమని అమెరికా అధ్యక్షుకుడు జో బైడెన్ (Joe Biden) కు భారత్ ఆహ్వానం పలికింది. దీనిపై అమెరికా ఇంకా ఏం స్పందిచలేదు. దీనికి కారణం కెనడాలో జరుగుతున్న వ్యవహారాలేనని భావించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదెలా ఉన్నా, కెనడాలో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం ఇక్కడ సిక్కు సముదాయంలో అలజడికి దారీ తీస్తుందా? అలా అయితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి అన్ని భయాందోళనలు ఎక్కువవుతున్నాయి. ఆన్ లైన్ లో యాక్టివిటీ పెరిగిందని, ఎప్పుడో భూ స్థాపితమైపోయిందని అనుకుంటున్న ఖలిస్తానీ వేర్పాటు ఉద్యమం తిరిగి ఊపిరి పోసుకుంటుందా అనేదే దేశాన్ని ఇప్పుడు ఎక్కువగా కలిచివేస్తున్న విషయం.

Read Also : Sidharth Luthra Tweet: ” ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది..” అంటూ సిద్దార్థ్ లూథ్రా ట్వీట్ ..