Vibrio Vulnificus : అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న మరో బ్యాక్టీరియా.. 13 మంది మృతి

ప్రతి సంవత్సరం సుమారు 200 మంది అమెరికన్లు విబ్రియో వల్నిఫికస్ బారిన పడుతుండగా.. కనీసం ఐదుగురు మరణిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 10:30 PM IST

మూడేళ్ల క్రితం ప్రపంచాన్నంతటినీ కొన్ని నెలలపాటు వణికించిన కరోనా(Corona) మహమ్మారి.. ఇప్పటికీ వదల్లేదు. అడపా దడపా కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాం అనుకునే ప్రతీసారి ఏదొక కొత్త వైరస్ భయపెడుతోంది. తాజాగా అమెరికాలో(America) మరో కొత్త బ్యాక్టీరియా విజృంభిస్తోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు ఈ మేరకు అప్రమత్తం చేశారు. యునైటెడ్ స్టేట్స్ లోని చాలా ప్రాంతాల్లో విబ్రియో వల్నిఫికస్(Vibrio Vulnificus) బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని, ఇప్పటి వరకూ 13 మంది మరణించారని సీడీసీ నిపుణులు చెబుతున్నారు.

ప్రతి సంవత్సరం సుమారు 200 మంది అమెరికన్లు విబ్రియో వల్నిఫికస్ బారిన పడుతుండగా.. కనీసం ఐదుగురు మరణిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ను అరికట్టేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ బ్యాక్టీరియా మనుషుల్లో ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని, పచ్చిమాసం, సరిగ్గా ఉడికించని మాంసం, సముద్రపు చేపలు తినడంతో చర్మంపై గాయాలు ఏర్పడుతాయని చెప్పారు. జ్వరం, లో బీపీ, చర్మంపై బొబ్బలు రావడం వంటివి.. ఈ బ్యాక్టీరియా లక్షణాలు అని నిపుణులు తెలిపారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, లేదంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. అగ్రరాజ్యంలో తరచూ వస్తున్న తుఫానులు, వరదలు ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తికి కారణమని సీడీసీ పేర్కొంది.

ఇన్ఫెక్షన్ వ్యాప్తిని తగ్గించాలంటే.. ఇది సోకిన వారు స్వీయ నిర్బంధం (సెల్ఫ్ క్వారంటైన్)లో ఉండాలని సూచించింది. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఇది వేగంగా వ్యాపిస్తుందని.. పచ్చిమాంసం, సముద్రపు చేపలను ఆహారంగా తీసుకోవడాన్ని తగ్గించాలన్నారు. టాటూలు వేయించుకున్నవారు, ఆపరేషన్లు చేయించుకున్నవారు.. సముద్రపు నీటిలోకి, ఉప్పునీటి జోలికి వెళ్లకూడదని నిపుణులు హెచ్చరించారు.

 

Also Read : Ghaziabad: కుక్క కరిచిన విషయం దాచిన బాలుడు.. చివరికి రేబిస్ తో మృతి