Strait Of Hormuz: మిడిల్ ఈస్ట్‌లో సీజ్‌ఫైర్ (కాల్పుల విరమణ) తర్వాత కూడా పరిస్థితులు చక్కబడటం లేదు. ఇరాన్ ఇప్పటివరకు హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవలేదు. మరోవైపు అమెరికా హార్ముజ్ జలసంధిపై నాకాబందీ (దిగ్బంధనం) విధించింది. దీనిపై చైనా, ఇరాన్, యెమెన్, రష్యా దేశాలు అమెరికాను హెచ్చరించాయి. హార్ముజ్ జలసంధి ద్వారానే అత్యధికంగా ముడి చమురు చైనాకు సరఫరా అవుతుంది. ప్రపంచంలోని 20 నుండి 22 శాతం చమురు ఇదే మార్గం గుండా వెళ్తుంది.
చైనా దీనిని తెరిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు హార్ముజ్ జలసంధి బ్లాక్ అవ్వడంతో చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవేళ చైనా, అమెరికా సముద్రంలో ముఖాముఖి తలపడితే ఎవరి పక్షం బలంగా ఉంటుంది? వివరంగా అర్థం చేసుకుందాం.
ప్రస్తుతం చైనా వద్ద నౌకల సంఖ్య (841+) పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళం ఉంది. అయితే గ్లోబల్ పవర్ ఇండెక్స్ 2026 ప్రకారం.. అమెరికా తన 11 విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాములతో ఇప్పటికీ అత్యంత ప్రమాదకరమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన నౌకాదళంగా కొనసాగుతోంది.
Also Read: KS Chithra: కూతురిని తలుచుకొని ఎమోషనల్ అయిన సింగర్ చిత్ర!
చైనా నౌకాదళం
చైనా నౌకాదళం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇందులో 841 యుద్ధనౌకలు ఉన్నాయి. ఈ సంఖ్య అమెరికా (465), రష్యా (747) కంటే ఎక్కువ. చైనా వేగంగా జలాంతర్గాములు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లను నిర్మించింది. దాని వద్ద 3 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, 4 హెలికాప్టర్ క్యారియర్లు ఉన్నాయి. చైనా నౌకాదళంలో 61 జలాంతర్గాములు ఉన్నాయి, వీటిలో కొన్ని అణుశక్తితో పనిచేసేవి కూడా ఉన్నాయి. ఇవి కాకుండా 53 డిస్ట్రాయర్లు, 46 ఫ్రిగేట్లు, 50 కార్వెట్‌లు ఉన్నాయి. నౌకాదళంలో 2.5 లక్షల కంటే ఎక్కువ మంది నావికులు ఉన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనా నౌకాదళం బలంగా ఉంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా పట్టు ఉన్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం చేసే సామర్థ్యం ఇప్పటికీ పరిమితంగానే ఉంది. ఎందుకంటే అమెరికా తరహాలో పెద్ద కెరీర్ స్ట్రైక్ గ్రూపులు చైనా వద్ద లేవు.
అమెరికా వర్సెస్ చైనా
గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2026 ప్రకారం.. చైనా సంఖ్యలో ముందున్నప్పటికీ.. నాణ్యత, సాంకేతికత, అంతర్జాతీయ ప్రాబల్యంలో అమెరికా ఇప్పటికీ బలంగా ఉంది. అమెరికా నౌకాదళంలోని 465 యుద్ధనౌకల మొత్తం బరువు (టన్నుల్లో) 82 లక్షల టన్నులు కాగా, చైనాది కేవలం 31 లక్షల టన్నులు మాత్రమే. అమెరికా నౌకాదళంలో 11 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు ఉండగా, చైనా వద్ద కేవలం 3 మాత్రమే ఉన్నాయి. అమెరికా యుద్ధనౌకలు అత్యంత ఆధునికమైనవి, సాంకేతికంగా ముందంజలో ఉన్నాయి.
అమెరికా నౌకాదళం
అమెరికా నౌకాదళం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది. దీని వద్ద 11 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, +9 హెలికాప్టర్ క్యారియర్లు ఉన్నాయి. 66 జలాంతర్గాములలో మెజారిటీ అణుశక్తితో పనిచేసేవే. అందులో 50 కంటే ఎక్కువ అణు జలాంతర్గాములు ఉన్నాయి. అమెరికా వద్ద 83 డిస్ట్రాయర్లు, 3 లక్షల కంటే ఎక్కువ మంది నావికులు ఉన్నారు. చైనా సంఖ్యలో ముందున్నప్పటికీ అమెరికా నౌకాదళానికి ఉన్న నాణ్యత, సాంకేతికత, అనుభవం చాలా ఎక్కువ. అమెరికా నౌకలు మరింత ఆధునికమైనవి, శక్తివంతమైనవి. ఇవి ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
