Site icon HashtagU Telugu

Spaceship Lost : తొలి ప్రైవేటు ‘మూన్ మిషన్’ ఫెయిల్.. సముద్రంలో కూలిన స్పేస్‌షిప్!

Spaceship Lost

Spaceship Lost

Spaceship Lost : మన చంద్రయాన్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన సీన్ గుర్తుంది కదూ !! అచ్చం అలాగే మూన్ ల్యాండింగ్ చేయించడానికి ఇటీవల అమెరికా చేపట్టిన ఒక ప్రయోగం ఫెయిలైంది. దీంతో ఆ ప్రయోగానికి ఖర్చు చేసిన రూ.831 కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. తొలిసారిగా ఈ ప్రయోగ నిర్వహణ కాంట్రాక్టును ఒక ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. ఆస్ట్రోబోటిక్ అనే ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల కంపెనీ  ‘పెరెగ్రైన్ ల్యాండర్’‌ను జనవరి 8న ప్రయోగించింది. ఈ ల్యాండర్‌.. రాకెట్ నుంచి విడిపోయిన వెంటనే దాని నుంచి ఇంధనం లీకేజీ జరిగింది. కొద్దిసేపటికే దానిలో పేలుడు సంభవించింది. దీంతో ల్యాండర్ బయటి భాగం దెబ్బతింది. ఈక్రమంలో ల్యాండర్ , స్పేస్ షిప్‌తో సంబంధాన్ని కోల్పోయింది. స్పేస్‌షిప్ దక్షిణ పసిఫిక్‌ సముద్ర ప్రాంతంలో ఏదో మారుమూలన కూలిపోయి ఉండొచ్చని ఆస్ట్రోబోటిక్ కంపెనీ అంచనా వేసింది. ఇక ఫెయిల్ కావడానికి ముందు పెరెగ్రైన్ ల్యాండర్(Spaceship Lost) అంతరిక్షంలో 10 రోజులకుపైగా పనిచేసింది. చంద్రునిపై నియంత్రిత టచ్‌డౌన్‌ను సాధించిన మొదటి ప్రైవేటు సంస్థగా ఆస్ట్రోబోటిక్ నిలిచింది.   ఏదిఏమైనప్పటికీ 50 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపాలన్న అమెరికా కల చెదిరింది.  ఆర్టెమిస్ ప్రోగ్రామ్ కింద 2030కల్లా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలనే అమెరికా లక్ష్యానికి ఈ వైఫల్యం పెద్ద ఎదురుదెబ్బ లాంటిది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక పెరెగ్రైన్ ల్యాండర్‌లో స్టార్ ట్రెక్ సృష్టికర్త జీన్ రాడెన్‌బెర్రీ, సైన్స్ ఫిక్షన్ రచయిత ఆర్థర్ సి. క్లార్క్‌ సహా దాదాపు 70 మంది వ్యక్తుల డీఎన్ఏ శాంపిల్స్, చితా భస్మాలు, అస్తికలను పంపారు. ఇప్పుడదే గల్లంతై సముద్రంలో పడిపోవడంతో అవన్నీ సముద్రం పాలైనట్లు అయింది. ఆస్ట్రోబోటిక్ కంపెనీ.. అంతరిక్షంలోకి డీఎన్ఏ శాంపిల్స్, చితా భస్మాలు, అస్తికలను పంపే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని మరీ డీఎన్ఏ శాంపిల్స్, చితా భస్మాలు, అస్తికలను సేకరించి ల్యాండర్‌లో చంద్రుడి వైపుగా పంపింది. దీంతో వాటిని అందించిన వారు నిరాశకు గురయ్యారు. ఈ వైఫల్యంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఫిబ్రవరిలో మరో ప్రయోగం జరగనుందని నాసా వర్గాలు వెల్లడించాయి. హ్యాస్టన్ కేంద్రంగా పనిచేసే మరో ప్రైవేటు కంపెనీ ఇంట్యూటివ్ మెషీన్స్ ఇంకో ల్యాండర్‌ను వచ్చే నెలలో ప్రయోగిస్తుందని తెలిపాయి. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించేందుకుగానూ వాటిని ప్రైవేటు కంపెనీలకు కాంట్రాక్టుకు ఇచ్చే పైలట్ ప్రాజెక్టుకు నాసా శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే అమెరికాలో ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థలను ప్రోత్సహిస్తున్నారు.