US Vs Pakistan : పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌కు అమెరికా అనూహ్య షాక్ ఇచ్చింది. తినడానికి తిండి లేకున్నా.. లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్ల తయారీలో పాకిస్తాన్ బిజీగా ఉందని తెలుసుకున్న అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపించింది. ఈ ఆంక్షలపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వివరణాత్మక ప్రకటన విడుదల చేశారు.
Also Read :Rupee Fall : ఆల్ టైం కనిష్ఠ స్థాయికి రూపాయి పతనం.. కారణాలు ఇవీ..
ఆ నాలుగు కంపెనీల కథ..
- యునైటెడ్ స్టేట్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (EO) 13382 ప్రకారం పాకిస్తాన్‌లోని నాలుగు కంపెనీలపై ఆంక్షలను ప్రకటించారు.
- ఆ కంపెనీల పేర్లు.. నేషనల్ డెవలప్‌మెంట్ కాంప్లెక్స్ (NDC), అక్తర్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్‌సైడ్ ఎంటర్‌ప్రైజ్.
- ఈ నాలుగు కంపెనీలు సామూహిక విధ్వంసక ఆయుధాల తయారీ, పంపిణీ కోసం పాకిస్తాన్ రక్షణ శాఖకు సహకరిస్తున్నాయని అమెరికా గుర్తించింది. ప్రత్యేకించి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్ల తయారీకి అవసరమైన సామగ్రిని ఈ కంపెనీలు సప్లై చేస్తున్నాయని అగ్రరాజ్యం దర్యాప్తులో తేలిందట. అందుకే వాటికి ఆంక్షలతో బ్రేకులు వేయబోతోంది.
- నేషనల్ డెవలప్‌మెంట్ కాంప్లెక్స్ (NDC) కంపెనీ హెడ్ క్వార్టర్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉంది. ఇది పాక్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తోంది. లాంగ్ రేంజ్ మిస్సైళ్ల తయారీలో, ప్రయోగంలో వాడే పరికరాలను ఈ కంపెనీ కొనుగోలు చేస్తోంది. షాహీన్ సిరీస్ బాలిస్టిక్ క్షిపణుల తయారీలోనూ ఎన్‌డీసీ కీలక పాత్ర పోషించింది.
- అక్తర్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హెడ్ క్వార్టర్ కరాచీలో(US Vs Pakistan) ఉంది. మిస్సైళ్ల తయారీలో, ప్రయోగాల్లో వాడే పరికరాలు ఈ కంపెనీ నుంచి ఎన్‌డీసీకి సప్లై అవుతున్నాయి.
- అఫిలియేట్స్ ఇంటర్నేషనల్ కంపెనీ కూడా కరాచీ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ కంపెనీ సైతం మిస్సైళ్ల తయారీలో వాడే పరికరాలను ఎన్‌డీసీకి సప్లై చేస్తోంది.
- రాక్‌సైడ్ ఎంటర్‌ప్రైజ్ అనే కంపెనీ కూడా కరాచీలోనే ఉంది. ఇది కూడా మిస్సైళ్ల తయారీలో వాడే పరికరాలను ఎన్‌డీసీకి సరఫరా చేస్తోంది.
- ఈ నాలుగు కంపెనీలు చైనా నుంచి మిస్సైళ్ల తయారీ పరికరాలు కొని.. పాకిస్తాన్ రక్షణ శాఖకు అందిస్తుంటాయని సమాచారం.
- పాకిస్తాన్‌లోని ఎన్‌డీసీ కంపెనీకి మిస్సైళ్ల తయారీ పరికరాలు సరఫరా చేస్తున్న పలు చైనా కంపెనీలపై ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే అమెరికా విదేశాంగ శాఖ ఆంక్షలు విధించింది. షాహీన్-3 మిస్సైళ్లు, అబాబీల్ సిస్టమ్‌ల కోసం రాకెట్ మోటార్లు, ఇతరత్రా సాంకేతిక పరికరాలను పొందేందుకు బీజింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆటోమేషన్ ఫర్ మెషీన్ బిల్డింగ్ ఇండస్ట్రీతో పాకిస్తాన్ కలిసి పనిచేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.
- పాకిస్తాన్ మిస్సైల్ టెక్నాలజీ మెరుగుదలకు దోహదపడే పరికరాలను సప్లై చేస్తున్న మూడు చైనా కంపెనీలపై 2023 సంవత్సరంలోనూ అమెరికా ఆంక్షలు విధించింది.