Site icon HashtagU Telugu

US Navy Seals : చైనాకు షాక్.. తైవాన్ ఆర్మీకి అమెరికా నేవీ సీల్స్ ట్రైనింగ్

Us Navy Seals Bin Laden

US Navy Seals : తైవాన్‌పై చైనా కన్నేసిన సంగతి తెలిసిందే. తైవాన్ ముమ్మాటికీ తమ భూభాగమే అని మొదటి నుంచీ చైనా వాదిస్తోంది. అయితే తైవాన్ మాత్రం తమది స్వతంత్ర దేశమని అంటోంది. తైవాన్‌కు అమెరికా అండగా నిలుస్తోంది. చైనాను ఎదుర్కొనేందుకు అవసరమైన సైనిక, ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఈక్రమంలోనే తైవాన్ ఆర్మీకి అమెరికాకు చెందిన నేవీ సీల్స్‌ టీమ్ ట్రైనింగ్ ఇస్తోందని తెలుస్తోంది.  తైవాన్‌కు చెందిన కొందరు సైనికులను అమెరికాకు తీసుకెళ్లి మరీ ట్రైనింగ్ ఇస్తున్నారని సమాచారం. ఒకవేళ చైనా దురాక్రమణకు దిగితే బలంగా తిప్పికొట్టేలా వ్యవహరించేందుకు అవసరమైన వ్యూహాన్ని తైవాన్‌ ఆర్మీకి(US Navy Seals) అమెరికా అందిస్తోందట.

Also Read :Kandahar Hijack : బీజేపీ ఉగ్రవాదులను వదిలేయబట్టే.. దేశం ఉగ్రదాడులను ఎదుర్కొంది : ఫరూక్ అబ్దుల్లా

ఇటీవలే అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ డైరెక్టర్‌ బిల్‌ బర్న్స్‌  సంచలన కామెంట్స్ చేశారు. తమ దేశ వార్షిక బడ్జెట్‌లో 20శాతం మొత్తం చైనా ముప్పు నుంచి ఎదుర్కొనేందుకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌తోనే తైవాన్ లాంటి అమెరికా మిత్రదేశాలకు సైనిక తోడ్పాటును అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయా మిత్రదేశాల సైన్యాలను ఆధునీకరించేందుకు తోడ్పాటును అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తైవాన్‌ను శాంతియుతంగా విలీనం చేసుకుంటామని చైనా అంటోంది. అయితే అమెరికా అండ చూసుకొని చైనాపై తైవాన్ తిరగబడే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయి. అదే జరిగితే భీకర యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఇందులో తైవాన్ నేవీ సీల్స్ కీలక పాత్ర పోషించనున్నారు. 2011 సంవత్సరంలో పాకిస్తాన్‌లోకి చొచ్చుకెళ్లి అల్‌ఖైదా నేత బిన్‌ లాడెన్‌ను చంపింది అమెరికా నేవీ సీల్స్ సభ్యులే. వాళ్ల స్ఫూర్తితోనే తైవాన్ ఆర్మీలోనూ నేవీ సీల్స్ టీమ్‌ను అమెరికా తయారు చేస్తోంది. మొత్తం మీద చైనా పొరుగునే పెద్ద సవాల్‌ను నిలబెట్టే దీర్ఘకాలిక వ్యూహంలో అమెరికాలో ఉందనేది విస్పష్టం.రానున్న రోజుల్లో చైనా ఏం చేస్తుంది ? తైవాన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Also Read :Non Stick Cookware : గర్భిణీ స్త్రీలు నాన్-స్టిక్‌ కుక్‌వేర్‌లో వండినవి తినకూడదా..?