ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం.. ఇప్పుడు ఏం జ‌ర‌గ‌బోతుంది?

లెబనాన్‌లో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణను ఇరాన్ ఒక ముందస్తు షరతుగా పెట్టింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దీనిని తీవ్రంగా తిరస్కరించాయి.

Published By: HashtagU Telugu Desk
Iran-US War

Iran-US War

US-Iran: ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. దాదాపు 15 నుండి 21 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చల్లో రెండు దేశాలు తమ తమ నిబంధనలకే మొగ్గు చూపడంతో ఒప్పందం కుదరలేదు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ ఆదివారం ఉదయం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మేము 21 గంటల పాటు నిరంతరం చర్చలు జరిపాము. కానీ ఇరాన్ మా ప్రతిపాదనలను అంగీకరించలేదు అని స్పష్టం చేశారు.

చర్చలు విఫలమవ్వడానికి కారణమైన 4 ప్రధానాంశాలు ఇవే

స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నియంత్రణ

అంతర్జాతీయ నౌకాయానానికి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఎటువంటి షరతులు లేకుండా, ఫీజులు లేకుండా పూర్తిగా తెరిచి ఉండాలని అమెరికా డిమాండ్ చేసింది. అయితే యుద్ధ సమయంలో దీనిని మూసివేసిన ఇరాన్.. అక్కడ తన ఆధిపత్యాన్ని లేదా కనీసం పాక్షిక నియంత్రణను గుర్తించాలని పట్టుబట్టింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% దీని ద్వారానే జరుగుతుంది.

Also Read: IPL రూల్ బ్రేక్ చేసి చిక్కుల్లో పడ్డ RR మేనేజర్

లెబనాన్ సీజ్‌ఫైర్ (కాల్పుల విరమణ)

లెబనాన్‌లో ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణను ఇరాన్ ఒక ముందస్తు షరతుగా పెట్టింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దీనిని తీవ్రంగా తిరస్కరించాయి. ఇది కేవలం ఒక “అవగాహన లోపం” అని జేడీ వెన్స్ పేర్కొన్నప్పటికీ ఇరాన్ తన పట్టు వీడలేదు.

ఆంక్షల సడలింపు

తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను తొలగించాలని, నిలిపివేసిన విదేశీ ఆస్తులను విడుదల చేయాలని, అణు శక్తిని పెంపొందించుకునే హక్కు కల్పించాలని ఇరాన్ కోరింది. అయితే ఇరాన్ అణు సామర్థ్యానికి సంబంధించిన ఎటువంటి రాయితీలు ఇచ్చేందుకు అమెరికా నిరాకరించింది. అమెరికా పెట్టిన 15 పాయింట్ల ప్రతిపాదనను ఇరాన్ “అత్యంత దురాశతో కూడినది” అని అభివర్ణించింది.

నష్టపరిహారం, ఇతర షరతులు

యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, ప్రాంతం మొత్తం శాంతి నెలకొనేలా సమగ్ర ఒప్పందం ఉండాలని ఇరాన్ కోరింది. దీనిని కూడా అమెరికా తోసిపుచ్చింది.

ట్రంప్ హెచ్చరిక.. తదుపరి పరిణామాలేంటి?

చర్చలు విఫలమయ్యాక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఒప్పందం కుదరకపోతే మళ్ళీ దాడులు మొదలుపెడతాం. ఇరాన్ ఓడిపోయింది, ఒప్పందం కుదిరినా కుదరకపోయినా మాకు అనవసరం అని తీవ్రంగా హెచ్చరించారు. ప్రస్తుతం రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ ఏ క్షణమైనా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది.

ఏప్రిల్ 12 ఉదయం వరకు ఎటువంటి సైనిక చర్యలు ప్రకటించలేదు. కానీ అమెరికా తన నావికాదళం ద్వారా హోర్ముజ్ జలసంధిని క్లియర్ చేసేందుకు లేదా టార్గెటెడ్ స్ట్రైక్స్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటు ఇరాన్ కూడా అమెరికా తమ షరతులు అంగీకరించకపోతే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించింది.

  Last Updated: 12 Apr 2026, 11:12 AM IST