Site icon HashtagU Telugu

US High Tariffs: భారత ఎగుమతులపై అమెరికా 50% సుంకం.. ఎంత న‌ష్ట‌మంటే?

US High Tariffs

US High Tariffs

US High Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై 50% అదనపు దిగుమతి సుంకం (US High Tariffs) విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు 27, 2025 నుండి అమల్లోకి వస్తుంది. ఈ చర్య వల్ల భారతదేశం నుండి అమెరికాకు జరిగే మొత్తం 86 బిలియన్ డాలర్ల ఎగుమతులలో 60 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఉత్పత్తులు ప్రభావితం కానున్నాయి. ముఖ్యంగా రొయ్యలు, దుస్తులు, తోలు, రత్నాలు, ఆభరణాల వంటి శ్రమ-ఆధారిత రంగాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఏఏ రంగాలు ప్రభావితం కానున్నాయి?

దుస్తుల రంగం: భారతదేశం నుంచి 10.3 బిలియన్ డాలర్ల విలువైన దుస్తులు ఎగుమతి అవుతాయి. దీనిపై ఈ సుంకం వల్ల తీవ్రమైన నష్టం తప్పదు.

రత్నాలు, ఆభరణాలు: అమెరికా ఈ రంగానికి అతిపెద్ద మార్కెట్. సుంకం పెంపుతో ఈ రంగం కూడా పెద్ద దెబ్బ తగులుతుంది. చాలా మంది ఎగుమతిదారులు ఈ రంగాల్లో ఉద్యోగాల కోత అనివార్యమని భావిస్తున్నారు.

రొయ్యలు, సముద్ర ఉత్పత్తులు: వీటి ఎగుమతులు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి.

తోలు, పాదరక్షల పరిశ్రమ: ఉత్పత్తిని నిలిపివేయడం లేదా ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు.

తివాచీలు, ఫర్నిచర్: ఈ రంగాల్లో కూడా పోటీతత్వం తగ్గిపోతుంది.

Also Read: Trump Called PM Modi: ట్రంప్ పదే పదే ఫోన్ చేసినా పట్టించుకోని మోదీ.. జర్మన్ పత్రిక సంచలన కథనం!

గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) నివేదిక ప్రకారం.. ఈ అమెరికా సుంకాల వల్ల అమెరికాకు భారతదేశం చేసే ఎగుమతులలో సుమారు 66 శాతం ప్రభావితం అవుతాయి. ఆగస్టు 27 నుండి 60.2 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 50 శాతం సుంకం విధించబడుతుంది.

ఆర్థిక రంగంపై ప్రభావం

GTRI సహ-వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఇటీవలి సంవత్సరాలలో భారత్‌కు ఇది అతిపెద్ద వాణిజ్యపరమైన దెబ్బ అని అన్నారు. ఈ నిర్ణయం వల్ల 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత ఎగుమతులు 49.6 బిలియన్ డాలర్ల వరకు తగ్గిపోవచ్చని ఆయన అంచనా వేశారు. ఈ సుంకాల పెంపుతో చైనా, వియత్నాం, మెక్సికో, టర్కీ, పాకిస్తాన్, నేపాల్, కెన్యా వంటి పోటీ దేశాలకు ప్రయోజనం చేకూరనుంది.

గతంలో ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు అమెరికా భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకం విధించింది. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకంతో కలుపుకుని మొత్తం సుంకం 50 శాతానికి చేరుకుంది. ఇటీవలి సంవత్సరాలలో న్యూఢిల్లీపై విధించిన అతిపెద్ద ఆర్థిక ఆంక్షలలో ఇది ఒకటి.