Pahalgam Attack: జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడికి 26 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడి తరువాత ప్రపంచంలోని పలు దేశాలు భారత్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు అండగా నిలుస్తామని ఇప్పటికే అమెరికా, రష్యాతో పాటు యూరోపియన్ దేశాలు తెలిపాయి. ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. తీవ్రంగా ఖండించారు. తాజాగా.. అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్ ఉగ్రవాద దాడిపై విచారం వ్యక్తం చేశారు. భారతదేశంతో నిలబడతామని చెప్పారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
తులసి గర్భర్డ్ ట్వీట్ ప్రకారం.. పహల్గామ్‌లో 26 మంది హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన భయంకరమైన ఇస్లామిక్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో మేము భారతదేశంతో సంఘీభావంగా నిలుస్తున్నాము. ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన వారికి నా ప్రార్థనలు మరియు ప్రగాఢ సానుభూతి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారతదేశ ప్రజలందరితో చెబుతున్నాం.. పహల్గామ్ దాడి ఉగ్రవాదులను పట్టుకోవడంలో అమెరికా సహాయం చేస్తుంది.. మేము మీతో ఉన్నాము.. మీకు మద్దతు ఇస్తున్నాము. అని పేర్కొన్నారు.
We stand in solidarity with India in the wake of the horrific Islamist terrorist attack, targeting and killing 26 Hindus in Pahalgam. My prayers and deepest sympathies are with those who lost a loved one, PM @narendramodi, and with all the people of India. We are with you and…
— DNI Tulsi Gabbard (@DNIGabbard) April 25, 2025
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సందర్శనకు వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు, ఈ ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రవాద సంఘటన జరిగిన సమయంలో, అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తన కుటుంబంతో కలిసి భారతదేశ పర్యటనలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి పహల్గామ్ దాడికి తన సంతాపాన్ని, పూర్తి మద్దతును తెలిపారు.
ఎవరీ తులసి..? ఆమె అంత పవర్ ఫుల్ లేడీనా..?
తులసీ గబ్బార్డ్ అమెరికాలో పవర్ ఫుల్ లేడీ. ట్రంప్ ప్రభుత్వంలో నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) డైరెక్టర్ గా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అమెరికాలోని మొత్తం 18 నిఘా సంస్థలు డీఎన్‌ఐ హోదాలో తులసి పర్యవేక్షణలో పనిచేస్తాయి. ప్రపంచంలో ఏ మారుమూల ఏం జరిగినా.. ఇవి సేకరిస్తాయి. చివరికి సీఐఏ అధిపతి కూడా ఆమెకు రిపోర్టు చేస్తారు. నిఘా సమాచారాన్ని క్రోడీకరించి రోజువారీ కీలక సమాచారాన్ని అధ్యక్షుడికి ఆమె వెల్లడిస్తారు. 9/11 దాడుల తర్వాత ఏర్పడిన కమిషన్ సూచనల మేరకు ఏర్పాటు చేసిన అత్యంత కీలక పదవి ఇది.
తులసి భారత్‌ను అమితంగా ఇష్టపడతారు. ఆమె మూలాలు ఇక్కడ ఉన్నాయని చాలా మంది భావించేంతగా అభిమానిస్తారు. అయితే 2012లో తాను భారతీయురాలిని కాదని ఆమె స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. జమ్మూకశ్మీర్‌లో పాక్ ఉగ్రవాదాన్ని తులసి పలు సందర్భాల్లో బహిరంగంగానే తప్పుపట్టారు. పుల్వామా దాడి వేళ సంతాపం తెలిపారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం పాక్ మానుకోవాలని హెచ్చరించారు.
ఇటీవలే భారత్ లో పర్యటన..
తులసీ గబ్బార్డ్ ఇటవలే భారత్ లో పర్యటించారు. మార్చి 17వ తేదీన ఆమె ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. గబ్బార్డ్‌కు మోదీ గంగా జలం అందజేయగా.. మోదీకి ఆమె రుద్రాక్ష మాల బహూకరించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ వంటి ముప్పును ఎదుర్కోవడంలో సహకారం పెంపొందించే మార్గాలపై వీరి మధ్య చర్చ జరిగింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌తోనూ గబ్బార్డ్ భేటీ అయ్యారు.