. వెనిజువెలా రాజకీయాల్లో అనూహ్య మలుపు
. చమురు ఉత్పత్తిపై అమెరికా షరతులు
. ఆర్థిక సంక్షోభం, భవిష్యత్ అనిశ్చితి
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజువెలాపై తన ఆధిపత్యాన్ని స్పష్టంగా ప్రదర్శించాలనే పట్టుదలతో ముందుకు వెళ్తున్నారని అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకుని దేశం వెలుపలికి తరలించినట్లు కథనాలు రావడం సంచలనంగా మారింది. ఈ పరిణామాల అనంతరం ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగెజ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ మార్పుల మధ్య కూడా వెనిజువెలా తన నియంత్రణలోనే ఉందని ట్రంప్ ప్రకటించడం రాజకీయంగా కొత్త ఉద్రిక్తతలకు దారి తీసింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు, తీసుకుంటున్న నిర్ణయాలు వెనిజువెలా సార్వభౌమత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా చమురు రంగాన్ని కేంద్రంగా చేసుకుని అమెరికా తన షరతులను అమలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
వెనిజువెలా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉన్న చమురుపై పట్టు సాధించడం ద్వారా దేశాన్ని ఒత్తిడిలోకి నెట్టాలనే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఏబీసీ న్యూస్ నివేదిక ప్రకారం, వెనిజువెలా చమురు ఉత్పత్తిని పెంచుకోవాలంటే అమెరికా విధించిన కఠిన షరతులకు అంగీకరించాల్సి ఉంటుందని పేర్కొంది. కొత్త నాయకత్వం చైనా, రష్యా, ఇరాన్, క్యూబా వంటి దేశాలతో ఉన్న ఆర్థిక సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అంతేకాదు, చమురు విక్రయాల్లో అమెరికాతో మాత్రమే భాగస్వామ్యం ఉండాలని, ముఖ్యంగా హెవీ క్రూడ్ ఆయిల్‌ను ప్రాధాన్యంగా అమెరికాకే సరఫరా చేయాలని షరతులు విధించింది. ఇది వెనిజువెలాకు తీవ్రమైన దెబ్బగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా ప్రస్తుతం వెనిజువెలా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసే దేశంగా ఉంది. ఆ సంబంధాలను తెంచుకోవడం అంటే ఆదాయంలో భారీ కోత పడినట్టే. ఈ నేపథ్యంలో అమెరికా ఒత్తిడిని వెనిజువెలా ఎలా ఎదుర్కొంటుందనేది కీలక ప్రశ్నగా మారింది.
యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రైవేట్ సమావేశంలో మాట్లాడుతూ, వెనిజువెలా చమురు ట్యాంకర్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయని, నిల్వ చేసుకునే స్థలం లేకపోవడం వల్ల అమెరికా డిమాండ్లకు లొంగక తప్పదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. బ్లూంబర్గ్ కథనం ప్రకారం, డిసెంబర్ చివరి నుంచి వెనిజువెలా చమురు బావులను మూసివేస్తోంది. అమెరికా ఆంక్షల కారణంగా ఎగుమతులు నిలిచిపోవడం, నిల్వలు నిండిపోవడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. అమెరికా అంచనాల ప్రకారం, వెనిజువెలా రాజధాని కారకాస్ కొన్ని వారాల్లోనే తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంది. చమురు అమ్మకాలు నిలిచిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. వెనిజువెలా తాత్కాలిక ప్రభుత్వం 30 నుంచి 50 మిలియన్ బ్యారెల్స్ చమురును అమెరికాకు అప్పగించనుందని, ఆ చమురును విక్రయించి వచ్చిన నిధులను తానే నియంత్రిస్తానని చెప్పారు. పరిణామాలు వెనిజువెలా భవిష్యత్తుపై భారీ అనిశ్చితిని మోపుతున్నాయి. అమెరికా ఆధిపత్యం వల్ల ఆ దేశం ఆర్థికంగా, రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటుందో, ఇతర దేశాలతో సంబంధాలు ఎలా మారుతాయో వేచి చూడాల్సిందే.
