Hindu Minorities : షేక్ హసీనా వెళ్లిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో పరిస్థితులు తలకిందులయ్యాయి. అక్కడి మైనారిటీ హిందువులపై దాడులు జరిగాయి. కొందరు పాకిస్తాన్ ప్రేరేపిత అల్లరిమూకలే ఈ దాడుల వెనుక ఉన్నారని అంటున్నారు. దీనిపై సాక్షాత్తూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందువులకు(Hindu Minorities) భద్రత కల్పించాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై విచారణ జరిపేందుకు ఇప్పుడు ఐక్యరాజ్యసమితి కూడా రంగంలోకి దిగింది.
Also Read :1948 September 17th : 1948 సెప్టెంబరు 17న తెలంగాణ చరిత్రలో అసలేం జరిగింది ?
బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందువుల, క్రైస్తవులపై జరిగిన దాడుల అంశంపై విచారణ జరిపేందుకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల పర్యవేక్షణ బృందం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చేరుకుంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్ హెచ్‌ఆర్‌సీ) ఒక నెలపాటు బంగ్లాదేశ్‌లో ఉండి ఆ హింసాకాండపై దర్యాప్తు జరపనుంది. ఈసందర్భంగా హిందూ మైనారిటీ గ్రూపులకు చెందిన నేతలు ఐరాస బృందాన్ని కలిసి తాము ఎదుర్కొన్న వేధింపుల వివరాలను తెలియజేయనున్నారు. బంగబంధు ఫౌండేషన్ ద్వారా బంగ్లాదేశ్‌లోని మైనారిటీ సంఘాలు తమపై జరిగిన దాడుల అంశాన్ని తెలియజేస్తూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌కు లేఖ రాశారు. దీనికి స్పందనగానే ఆయన ప్రత్యేక టీమ్‌ను విచారణ జరిపేందుకు ఢాకాకు పంపారు.
Also Read :Atishi : ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి మార్లేనా
‘‘ఆగస్టు 5న షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో పెద్దఎత్తున హత్యలు జరిగాయి. చాలామంది మైనారిటీల ఇళ్లను, మతపరమైన సంస్థల ఆఫీసులను తగలబెట్టారు. ఆయా వర్గాలకు చెందిన చాలామంది సామాజిక కార్యకర్తలపై దాడులు జరిగాయి ’’ అని ఐరాసకు రాసిన ఫిర్యాదు లేఖలో ప్రస్తావించారు. స్థానికంగా ఉన్న జమాతే ఇస్లామీ పార్టీకి పాకిస్తాన్ మద్దతు ఉందని అందులో ప్రస్తావించారు. ఆగస్టు 8న బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారథిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్ పగ్గాలు చేపట్టారు. అయినా మతపరమైన అల్లర్లు ఆగలేదు. కొన్ని మతపరమైన అతివాద సంస్థలు మైనారిటీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశాయి.