Israel – War Crime : పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో గ్రౌండ్ ఆపరేషన్ చేస్తున్న ఇజ్రాయెల్ ఆర్మీ మానవ హక్కులు హరిస్తోంది. యుద్ధ నేరాలకు పాల్పడుతోంది. ఈవిషయాన్ని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం వెల్లడించింది. గాజా నగరంలో దాదాపు 11 మంది నిరాయుధులైన పాలస్తీనియన్ పురుషులను వారి కుటుంబాల ఎదుటే ఇజ్రాయెల్ దళాలు దారుణంగా కాల్చి చంపాయి. ఈ ఉదంతాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం సీరియస్‌గా తీసుకుంది. ఇది ఇజ్రాయెల్ చేసిన యుద్ధ నేరమని, ఆ దారుణ ఘటనపై విచారణ చేస్తామని వెల్లడించింది. గాజాలోని అల్ రెమల్ పరిసరాల్లోని అల్ అవదా భవనాన్ని ఇజ్రాయెల్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకొని.. అక్కడున్న 11 మంది నిరాయుధులైన పాలస్తీనియన్ పురుషులను హత్య చేశాయి. ఇలాంటి దుశ్చర్యల ద్వారా ఇజ్రాయెల్ ఆర్మీ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం(Israel – War Crime) ఆరోపించింది. ఈ మారణకాండలో చనిపోయిన 11 మంది పాలస్తీనా యువకులంతా 20 నుంచి 30 ఏళ్లలోపు వారేనని తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
అయితే ఈ ఘటనపై ఇజ్రాయెల్ ఆర్మీ ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీ సాగిస్తున్న మారణకాండకు అల్ రెమల్‌లో జరిగిన ఘోరమైన దాడి ఘటనే నిదర్శనమని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు అంటున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో ఇప్పటివరకు 20వేల మంది సామాన్య పౌరులు చనిపోయారు. వీరిలో మహిళలు, పిల్లలే ఎక్కువమంది ఉన్నారు. అనధికారికంగా ఇంకా ఎక్కువ మందే గాజాలో చనిపోయారని తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడుల్లో కూలిపోయిన భవనాల కింద చిక్కుకుపోయి కుళ్లిన డెడ్‌బాడీలు కూడా వందలాదిగా ఉంటాయని అరబ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.