Site icon HashtagU Telugu

Palestine In UN : తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు సీటు.. ఇజ్రాయెల్ భగ్గు

Palestine In Un

Palestine In UN : ఐక్యరాజ్యసమితి చరిత్రలో మరో కీలక ఘట్టం ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. ఐరాస 79వ సర్వసభ్య సమావేశంలో పాలస్తీనాకు ఈసారి సీటును కేటాయించారు. శ్రీలంక, సూడాన్ దేశాల మధ్యలో పాలస్తీనా ప్రతినిధికి సీటును కేటాయించారు. ఐక్యరాజ్యసమితిలోని పాలస్తీనా అథారిటీ రాయబారి రియాద్ మన్సూర్ ఆ సీటులో కూర్చున్నారు. ఆయన టేబుల్ వద్ద ‘పాలస్తీనా దేశం’(Palestine In UN) అనే బ్యాడ్జీని ఏర్పాటు చేశారు.  ఐరాసలో ఇప్పటివరకు పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం లేదు. అయినప్పటికీ ఈసారి సెషన్‌లో ఆ దేశం ప్రతినిధికి కూర్చునే అవకాశాన్ని కల్పించారు.

Also Read :Cloud Kitchen : రైల్వేశాఖలో ఇక క్లౌడ్‌ కిచెన్లు.. ఎలా పనిచేస్తాయంటే.. ?

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ  కొత్త అధ్యక్షుడిగా కామెరూన్ దేశ మాజీ ప్రధానమంత్రి ఫిలెమోన్ యాంగ్ వ్యవహరిస్తున్నారు. ఈసారి సెషన్‌లో పాలస్తీనా దేశానికి సీటును కేటాయించాలనే సంచలన నిర్ణయం తీసుకున్నది ఆయనే.  ఆయన సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా, హైతీ, ఉక్రెయిన్ యుద్ధాలను ఆపాల్సిన బాధ్యత యావత్ ప్రపంచ దేశాలపై ఉందన్నారు. ఆ దిశగా చొరవను ప్రదర్శించేందుకే పాలస్తీనాకు ఈ సెషన్‌లో సీటును కేటాయించినట్లు తెలిపారు. పాలస్తీనా ప్రజల వాణిని కూడా యావత్ ప్రపంచం వినాల్సిన అవసరం ఉందన్నారు. ఈనిర్ణయం తీసుకున్నందుకు ఫిలెమోన్ యాంగ్‌ను ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అభినందనలు తెలిపారు.

Also Read :Ola Showroom On Fire : ఓలా స్కూటర్ పనిచేయడం లేదని.. ఓలా షోరూంకు నిప్పుపెట్టిన యువకుడు

అయితే ఈ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. కొన్ని దేశాల మన్ననలు పొందేందుకే పాలస్తీనాకు ఈసారి సెషన్‌లో సీటును కేటాయించారని పేర్కొంది. పాలస్తీనాకు  ఐరాస శాశ్వత సభ్యత్వం లేదని గుర్తుచేసింది.  సభలో పాల్గొనే హక్కు కేవలం సార్వభౌమ దేశాలకు మాత్రమే ఉందని ఇజ్రాయెల్ అభిప్రాయపడింది. కాగా, ఈ పరిణామంతో ఇజ్రాయెల్‌  కంగుతింది. గతేడాది అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ నిరంతరాయంగా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో దాదాపు 40వేల మందికిపైగా చనిపోయారు. యుద్ధాన్ని ఆపమని ఐక్యరాజ్యసమితి కోరుతున్నా ఇజ్రాయెల్ వినడం లేదు. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస ఇలాంటి నిర్ణయం తీసుకుందని పరిశీలకులు అంటున్నారు.