Ukraine Vs Russia: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు తీవ్రరూపు దాలుస్తోంది. తాజాగా ఇవాళ తెల్లవారుజామున రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ ఏకంగా 73 డ్రోన్లతో విరుచుకుపడింది. ఈవివరాలను స్వయంగా మాస్కో మేయర్ సెర్గీ సొబ్యానిన్ ధ్రువీకరించారు. ఉక్రెయిన్ వైపు నుంచి దూసుకొచ్చిన 11 డ్రోన్లను రామెన్ స్కీ, దోమో దెదోవో జిల్లాల పరిధిలో తమ దేశ సైన్యం కూల్చేసిందన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివసించే మాస్కో నగరాన్ని టార్గెట్ చేయడం అనేది రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌కు పెనుముప్పుగా మారొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు లేదా రేపు ఉక్రెయిన్‌పై రష్యా ప్రతీకార దాడులకు దిగొచ్చని సమాచారం.
Also Read :Rambha : మళ్లీ వెండితెరపైకి రంభ.. కీలక అప్‌డేట్
బహుళ అంతస్తుల భవనాల్లో మంటలు
ఇవాళ ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో మాస్కో(Ukraine Vs Russia) నగర శివార్లలోని పలు బహుళ అంతస్తుల భవనాల్లో మంటలు వ్యాపించాయి. లోపల ఉన్న ఫర్నీచర్, కిటికీలు, ఇతరత్రా సామగ్రి ధ్వంసమయ్యాయి. డ్రోన్లు తాకిన అపార్ట్‌మెంట్లలోని ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. కార్లు పార్కింగ్ చేసిన ప్రాంతాల్లోనూ ఈ డ్రోన్లు పడ్డాయి. దీంతో ఆయా వాహనాలకు నిప్పంటుకుంది. వెంటనే రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి, ఆయా అపార్ట్‌మెంట్లలో సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించాయి.
Also Read :Syria Bloodbath: సిరియాలో రక్తపాతం.. అలావైట్ల ఊచకోత.. ఎవరు వారు?
ఓ వైపు చర్చలు.. మరోవైపు..
ఓవైపు ఉక్రెయిన్-రష్యాలు సౌదీ అరేబియా వేదికగా శాంతి చర్చలకు రెడీ అవుతున్నాయి. ఈ చర్చల్లో సౌదీ అరేబియా, అమెరికాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మరోవైపు దాడులు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ బలహీనంగా ఉన్నప్పటికీ ఈ తరహా దాడులు చేయడం వల్ల శాంతిచర్చల ప్రయత్నాలు భగ్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన విధంగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దూకుడును తగ్గించాల్సిన అవసరం ఉంది. లేదంటే అణ్వాయుధ దేశం రష్యా ఆగ్రహానికి బుగ్గి కావాల్సి రావచ్చు. అమెరికా చేతులు ఎత్తేసినా, ఉక్రెయిన్ దూకుడు ఎందుకు ప్రదర్శిస్తోంది ? అంటే.. ఐరోపా దేశాల నుంచి దానికి సహకారం లభిస్తోందనే టాక్ వినిపిస్తోంది.