బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (British PM Keir Starmer) మీడియా ముందే ఆ పనిచేసి వార్తల్లో నిలిచారు. సాధారణంగా ఆరోగ్య పరీక్షలు వ్యక్తిగతంగా, ఆస్పత్రుల్లోనే చేసుకోవడం చేస్తుంటారు. అయితే కీర్ స్టార్మర్ మాత్రం హెచ్ఐవీ పరీక్షను (HIV Test) మీడియా ముందు బహిరంగంగా చేయించుకుని వైరల్ గా మారారు. జీ7 దేశాల నేతలలో ఇలా బహిరంగంగా హెచ్ఐవీ టెస్టు చేయించుకున్న మొదటి ప్రధాని అనే రికార్డు ఆయన పేరిట నమోదైంది.
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి భారీ ఊరట..!!
ప్రధాని స్టార్మర్‌కు హెచ్ఐవీ సోకిందనే అనుమానం లేకపోయినా, దేశ ప్రజలలో హెచ్ఐవీ పరీక్షలపై అవగాహన పెంచడం కోసం ఆయన ఈ పరీక్ష చేయించుకున్నారు. హెచ్ఐవీ టెస్టు వార్షికోత్సవం సందర్భంగా, టెరెన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్ అనే సంస్థతో కలిసి ఆయన 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఈ పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో నెగెటివ్ అని తేలిన విషయాన్ని కూడా ఆయన బహిరంగంగా ప్రకటించారు. కేవలం ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చని స్టార్మర్ వివరించారు. దేశ ప్రజలంతా ధైర్యంగా ముందుకు వచ్చి హెచ్ఐవీ టెస్టులు చేయించుకోవాలని, తద్వారా ఆరోగ్యపరమైన భద్రతను పొందాలని సూచించారు. ఒక వారం రోజుల పాటు ఉచితంగా ఈ పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
యూకే ప్రభుత్వం 2023లోనే హెచ్ఐవీ నిర్మూలన ప్రణాళిక ప్రకటించింది. 2030 నాటికి దేశంలో కొత్త హెచ్ఐవీ కేసులు పూర్తిగా ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 2012 నుంచి ప్రతి సంవత్సరం ఉచితంగా హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం.. ప్రస్తుతం 4,700 మంది హెచ్ఐవీతో ఉన్నా, వారు నిర్ధారణ పొందలేదని తెలిపింది. వారిని గుర్తించేందుకు ఈ పరీక్షలను మరింత పెంచాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది.