నువ్వా నేనా అన్నట్లు సాగిన అమెరికా ఎన్నికల్లో (US Presidential election 2024) రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(donald trump) ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఇప్పటికే 277 సీట్లలో విజయం సాధించారు. అధ్యక్షుడు కావడానికి మ్యాజిక్ ఫిగర్ 270 కాగా ఆయన 7 స్థానాల ఎక్కువగానే గెలుచుకొని , అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. అమెరికా అధ్యక్షుడు కావడం ఆయనకు ఇది రెండోసారి కావడం విశేషం.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంతో ఐటీకి మంచి రోజులు రాబోతున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు . చాలా కాలంగా మందగించిన ఐటీ పరిశ్రమ వ్యాపారం వేగంగా పెరుగుతుందని ఇన్వెస్టర్లు మాట్లాడుకుంటున్నారు. ఇటు భారతీయ స్టాక్ మార్కెట్లలోని లిస్టెడ్ ఐటీ కంపెనీల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు పోటీపడుతున్నారు. ఇంట్రాడేలో ప్రధానంగా ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ షేర్లలో ర్యాలీ నమోదైంది. టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్, ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీ, హెచ్‌సిఎల్, కొఫోర్జీ, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ సహా మరిన్ని టెక్ కంపెనీల షేర్లు ఏకంగా 2-4 శాతం మధ్య వృద్ధితో కొనసాగుతున్నాయి. ఇక ట్రంప్ సైతం ఫలితాల అనంతరం మాట్లాడుతూ అమెరికాలో తిరిగి స్వర్ణయుగం తన పరిపాలనలో వస్తుందని చెప్పడం తో ఇన్వెస్టర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ భారతీయులు మాత్రం ట్రంప్ గెలుపొందడం తో కాస్త సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. భారతీయ ఐటీ పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉండనుందనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. దీనికి తోడు టెక్ జాబ్ కొట్టాలి అమెరికాలో గ్రీన్ కార్డ్ పట్టాలి అని ఆశల్లో ఉన్న భారతీయ ఐటీ నిపుణుల పరిస్థితిపై కూడా అనేక అనుమానాలు మొదలయ్యాయి.
డొనాల్డ్ ట్రంప్ ప్రభావం భారతీయ ఐటీ పరిశ్రమపై మరింత స్పష్టంగా కనిపిస్తుంది. H-1B వీసా పాలసీ, అవుట్‌సోర్సింగ్ నిబంధనలు మరియు స్థానిక ఉద్యోగాల పట్ల ట్రంప్ యొక్క కఠిన వైఖరితో సంబంధించి అనేక కీలక నిర్ణయాలు రావడం అనివార్యం. ఈ నిర్ణయాలు భారతీయ టెక్ దిగ్గజాలను, ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి సంస్థలను ప్రభావితం చేయవచ్చు. ట్రంప్ పరిపాలనలో స్థానిక ఉద్యోగాల పెరుగుదల కోసం అతను విదేశీ నిపుణులపై నియంత్రణలు పెంచే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారతీయ టెక్ సంస్థలు తమ అమెరికన్ క్లయింట్ల కోసం H-1B వీసాలపై అధికంగా ఆధారపడ్డాయి. అయితే, ఈ వీసాలపై మార్పులు వస్తే, దీని ప్రభావం ఆన్‌సైట్ ఉద్యోగాలకు వెళ్ళే భారతీయ ఐటీ నిపుణులపై పడుతుంది. చూద్దాం ట్రంప్ ఏంచేస్థాడో..!!
Read Also : Reverse Image Search : ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ ఫీచర్.. మార్ఫింగ్ ఫొటోలకు వాట్సాప్ చెక్