Site icon HashtagU Telugu

Trump vs Vance : ట్రంప్‌కు షాకిచ్చిన తెలుగింటి అల్లుడు.. వైస్ ప్రెసిడెంట్ కాకముందే..

Trump Vs Jd Vance Capitol Hill Rioters 2025

Trump vs Vance : డొనాల్డ్ ట్రంప్  జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే అంతకంటే ముందే ఆయనకు ఒక షాక్ తగిలింది.  అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా జేడీ వాన్స్‌కు ట్రంప్ అవకాశం ఇచ్చారు. ఇంకో వారం తర్వాత ఇద్దరూ కలిపి అమెరికా ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంది. ఈ తరుణంలో తెలుగింటి అల్లుడు  జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా తనకు వైస్ ప్రెసిడెంట్‌గా అవకాశమిచ్చిన ట్రంప్‌తోనే విభేదించారు.

Also Read :Maha Kumbh Revenue : మహాకుంభ మేళాతో కాసుల వర్షం.. సర్కారుకు రూ.2 లక్షల కోట్ల ఆదాయం

క్షమాభిక్ష వాళ్లకు వద్దు అంటూ..

2020 సంవత్సరంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఓటమి ఎదురైంది. దీంతో ఆ సమయంలో పెద్దసంఖ్యలో ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌లోకి చొరబడ్డారు. ట్రంప్‌కు అనుకూలంగా ప్లకార్డులు, ఫ్లెక్సీలు, బ్యానర్లను ప్రదర్శించారు. క్యాపిటల్ హిల్ భవనం లోపల బాణసంచా కాల్చారు. నినాదాలు చేశారు. భద్రతా సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఇదంతా చేసిన వారు తన మద్దతుదారులే కావడంతో.. వారిపై ట్రంప్ సానుభూతితో ఉండటం సహజ అంశమే. అయితే కాబోయే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాత్రం ట్రంప్ వైఖరితో విభేదించారు. ఫాక్స్‌ న్యూస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వాన్స్‌  మాట్లాడారు. ‘‘2020 సంవత్సరం జనవరి 6న జరిగిన క్యాపిటల్ హిల్ ఘటనలో శాంతియుతంగా నిరసన తెలిపిన వారికి  క్షమాభిక్ష లభిస్తుంది. ఒకవేళ ఆ రోజు ఎవరైనా హింసకు పాల్పడి ఉంటే క్షమాభిక్ష రాదు. అయితే దీనిపై కొంత అస్పష్టత ఉంది. అప్పట్లో అల్లర్లకు సంబంధించి కేసులో చాలామంది అమాయకులు విచారణను ఎదుర్కోవడం సరికాదు. దాన్ని మనం సరిచేయాలి’’ అని జేడీ వాన్స్(Trump vs Vance) కామెంట్ చేశారు.

Also Read :Z Morh Tunnel : ‘జెడ్ -మోర్హ్’ సొరంగానికి మోడీ శ్రీకారం.. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

వివరణ విడుదల చేసిన వాన్స్

దీంతో సోషల్ మీడియా వేదికగా జేడీ వాన్స్‌‌పై ట్రంప్ మద్దతుదారులు విరుచుకుపడుతున్నారు. ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వాన్స్ స్పందించి, ఎక్స్‌ వేదికగా వివరణను విడుదల చేశారు. ‘‘మొదటగా నేనొక విషయాన్ని చెప్పదలిచాను. అదేమిటంటే.. 2020 జనవరి 6న నిరసనల్లో పాల్గొని కేసులను ఎదుర్కొంటున్న వారి సహాయార్ధం నేను కూడా విరాళం ఇచ్చాను.  నేను విరాళం ఇవ్వడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోయారు. అప్పట్లో నేను సెనేట్‌కు పోటీచేసినప్పుడు వాళ్లు విమర్శించారు. నిరసనకారులను చాలా ఏళ్లుగా రక్షిస్తున్న వారిలో నేను కూడా ఉన్నాను’’ అని వాన్స్ గుర్తు చేశారు. ‘‘ఇంకో విషయం ఏమిటంటే.. ఆనాడు క్యాపిటల్ హిల్‌పై దాడిలో పాల్గొన్న నిరసనకారుల్లో కొంతమది ప్రభుత్వ ఇన్ఫార్మర్లు కూడా ఉన్నారు. వారికి క్షమాభిక్ష ఇస్తారా ? అలా జరుగుతుందని నేను భావించట్లేదు.  ఆనాడు క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడికి సంబంధించిన ప్రతీ కేసును తాను పరిశీలిస్తానని ట్రంప్ నాతో చెప్పారు. నేను చెప్పేది కూడా అదే. అన్యాయంగా జైలుపాలైన వాళ్లను కాపాడి తీరుతాం. ఇతరుల ప్రభావానికి లోనై రెచ్చిపోయిన వారు, అనవసర విచారణలు ఎదుర్కొంటున్న వారిని రక్షిస్తాం’’  అని వాన్స్ వివరణ జారీ చేశారు. కాగా, జేడీ వాన్స్ సతీమణి ఆంధ్రా అమ్మాయే.