అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా పేర్కొన్న ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ (Big Beautiful Bill) పై సంతకం చేశారు. అమెరికా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన ప్రత్యేక పిక్నిక్ వేడుకలో ఈ చట్టంపై ట్రంప్ అంగీకార ముద్ర వేశారు. ఈ చట్టం ద్వారా భారీ స్థాయిలో పన్ను తగ్గింపులు కలుగనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అలాగే ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, ఆర్థిక వ్యవస్థను బలపడించడమే లక్ష్యంగా ఈ బిల్లు రూపొందించామని తెలిపారు. రాజకీయ ర్యాలీలా ఏర్పాటైన ఈ కార్యక్రమానికి వందలాది మంది ట్రంప్ మద్దతుదారులు, కాంగ్రెస్ సభ్యులు, సైనిక కుటుంబాలు, అధికారులు హాజరయ్యారు. సంతక వేళ యుద్ధ విమానాలు ఆకాశంలో గౌరవ వందనం చేయడం విశేషం.
Avoid Sugar: చక్కెర మానితే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు – ఒక్క నెల చాలు!
ఈ సందర్బంగా ట్రంప్ (Donald Trump) మాట్లాడుతూ.. ఇది తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే చట్టమని పేర్కొన్నారు. పన్నులు తగ్గించడం, అనవసర ప్రభుత్వ ఖర్చులకు చెక్ పెట్టడం ద్వారా మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారులకు ఉపశమనం కలగనుందని వెల్లడించారు. ఈ చట్టం కారణంగా అమెరికన్ కుటుంబాలు, ఉద్యోగులు, మిలిటరీ సిబ్బందికి లాభం చేకూరుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. సెనెట్ మేజారిటీ లీడర్ జాన్ తూన్, హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ బిల్లుతో దేశ అప్పు మూడు ట్రిలియన్ డాలర్లు పెరుగుతుందన్న అభిప్రాయాలను ట్రంప్ ఖండించారు.
ఈ చట్టాన్ని విపక్ష డెమొక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డెమొక్రటిక్ నేత హకీమ్ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఏకంగా 8 గంటల 46 నిమిషాల పాటు ప్రసంగించారు. ధనికులకు లాభం కలిగించేలా, పేద ప్రజల ఆరోగ్య బీమా, ఆహార భద్రతను తగ్గించేలా ఇది ఉండబోతుందని హెచ్చరించారు. ట్రంప్ పన్ను తగ్గింపులను శాశ్వతంగా చేస్తూ తీసుకువచ్చిన ఈ చట్టం, అనేక పౌరులను ఆరోగ్య బీమా హక్కు కోల్పోయే పరిస్థితికి దారితీస్తుందని, విద్యా, ఆరోగ్య రంగాల్లో నెగటివ్ ప్రభావం పడే అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు. వలస విధానాలను కఠినతరం చేయడానికీ అధిక నిధులు కేటాయించబడుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు టెక్ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు కూడా ఈ చట్టంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.