Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రక్రియలో డొనాల్డ్ ట్రంప్ మరో కీలక పురోగతిని సాధించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. సోమవారం రాత్రి విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. డొనాల్డ్ ట్రంప్(Trump) పేరును అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులంతా ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతును ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జె.డి.వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. దీంతో ఈ ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కొనేందుకు రిపబ్లికన్ పార్టీ పూర్తి స్థాయిలో సమాయత్తం అయింది.
Also Read :Rohit Retirement: వన్డే, టెస్టు ఫార్మేట్ల రిటైర్మెంట్ పై రోహిత్ స్పందన
ఒహాయో సెనేటర్ జె.డి.వాన్స్‌ను అమెరికా ఉపాధ్యక్ష పదవి కోసం ఎంపిక చేయడాన్ని ట్రంప్ సమర్ధించుకున్నారు. తాను ఎంతో ఆలోచించి.. ఆయనకు ఆ అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఈమేరకు తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ట్రంప్ రాసుకొచ్చారు. ‘‘జె.డి.వాన్స్ ఒహాయో స్టేట్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడు అయ్యారు. ఆయన యేల్ వర్సిటీలో లా చేశారు. యేల్ లా జర్నల్‌కు సంపాదకుడిగా ఉన్నారు. గతంలో అమెరికా మెరైన్ విభాగంలో సేవలు అందించారు. వాన్స్ రచించిన ‘హిల్‌బిల్లీ ఎలెజీ’ పుస్తకం అత్యధికంగా అమ్ముడు కావడంతో పాటు దానిపై సినిమా తీశారు. ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త కూడా’’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. 39 ఏళ్ల వాన్స్ 2022లో అమెరికా సెనేట్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. వాస్తవానికి మొదట్లో ఆయన ట్రంప్ విధానాలను విమర్శించే వారు. ఆ తర్వాత ట్రంప్‌కు విధేయుడిగా మారారు. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులను(Republican Nominee) ఖరారు చేయడం గమనార్హం.