Harmeet Dhillon: మరో భారత బిడ్డకు అమెరికాలో కీలక పదవి దక్కింది. కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతతి వనిత హర్మీత్ కె.ధిల్లాన్‌కు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు. పౌర హక్కుల సహాయక అటార్నీ జనరల్‌గా ఆమెను నియమిస్తున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా సంస్థ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ప్రకటించారు. లాయర్‌గా వృత్తి జీవితంలో పౌర హక్కులను కాపాడేందుకు హర్మీత్ ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. కరోనా సంక్షోభం సమయంలో ప్రార్థనలు చేసుకోకుండా అడ్డుకోవడంపై న్యాయపరంగా ఆమె పోరాడారని గుర్తు చేశారు. అమెరికాలోని అగ్రశ్రేణి న్యాయవాదుల్లో హర్మీత్ ఒకరని ట్రంప్ చెప్పారు. ఈ కొత్త పదవిలో రాజ్యాంగ, పౌర హక్కులను, ఎన్నికల చట్టాలను న్యాయపరంగా ఆమె అమలుచేస్తారని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
Also Read :Telugu States : తెలంగాణ, ఏపీ విడిపోయి పదేళ్లు.. నేటికీ పరిష్కారానికి నోచుకోని సమస్యలివీ
హర్మీత్ ఎవరు ? ఏం చేస్తారు ?
- హర్మీత్ కె.ధిల్లాన్(Harmeet Dhillon) 1969 సంవత్సరంలో ఇండియాలోని చండీగఢ్‌లో జన్మించారు.
- హర్మీత్ బాల్యంలోనే వారి కుటుంబం చండీగఢ్ నుంచి అమెరికాకు వలస వెళ్లింది. అక్కడే స్థిరపడిపోయింది.
- హర్మీత్ తండ్రి తేజ్‌పాల్ సింగ్ ధిల్లాన్ అప్పట్లోనే ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్.
- అమెరికాలోని హానోవర్‌లో ఉన్న డార్ట్‌మౌత్ కాలేజీలో క్లాసికల్ లిటరేచర్‌లో హర్మీత్ బీఏ కోర్సును పూర్తి చేశారు.
- వర్జీనియా యూనివర్సిటీలో ఆమె లా చేశారు.
- 2003-2004 వరకు ఒరిక్, హెరింగ్టన్ సట్‌క్లిఫ్‌లలో సాధారణ లాయర్‌గా హర్మీత్ సేవలు అందించారు.
- తదుపరిగా ‘ధిల్లాన్ లా గ్రూప్ ఇంక్’ అనే కంపెనీని హర్మీత్ స్థాపించారు. అందులో ఆమె ట్రయల్ లాయర్‌గా పనిచేస్తూనే సంస్థ బాధ్యతలు నిర్వర్తించేవారు.
- మొదటి నుంచీ రిపబ్లికన్ పార్టీలో హర్మీత్ యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. గత సంవత్సరం రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీ అధ్యక్ష పదవికి హర్మీత్ పోటీ చేశారు. అయితే ఓడిపోయారు.
- 2018 సంవత్సరంలో ‘సెంటర్ ఫర్ అమెరికన్ లిబర్టీ’ అనే స్వచ్ఛంద సంస్థను హర్మీత్ ప్రారంభించారు.
- అమెరికాలోని ప్రఖ్యాత ఫాక్స్ న్యూస్ టీవీ ఛానల్‌లో తరుచుగా నిర్వహించే న్యూస్ షోలలో గెస్ట్‌గా హర్మీత్ హాజరవుతుంటారు. తద్వారా ఆమె పాపులారిటీ బాగా పెరిగింది.
- డొనాల్డ్ ట్రంప్‌ను రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించేందుకు గతంలో పార్టీ నేషనల్ కన్వెన్షన్‌ను నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ట్రంప్ గెలుపు కోసం, రిపబ్లికన్ పార్టీ గెలుపు కోసం సిక్కు మత సంప్రదాయం ప్రకారం హర్మీత్ ప్రార్థనలు చేశారు.