India Vs Pak: కశ్మీరులో పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి భారత్, పాక్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. భారత్ ఇప్పటికే ప్రతీకార చర్యలను మొదలుపెట్టింది. పాకిస్తానీల వీసాలను రద్దు చేసింది. సింధూ నదీజలాల ఒప్పందం అమలు ఆపేసినట్లు ప్రకటించింది. భారత్‌లోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం వద్ద భద్రతను తగ్గించింది. పాకిస్తాన్‌తో వ్యాపార, వాణిజ్యాలను ఇక చేసేది లేదని భారత సర్కారు తేల్చి చెప్పింది. క్రికెట్ మ్యాచ్‌లు సైతం పాక్‌తో ఆడేది లేదని వెల్లడించింది. దీంతో పాకిస్తాన్ సర్కారు కూడా చర్యలకు ఉపక్రమించింది. ఇవాళ ఉదయం ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ (NSC) సమావేశమైంది. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్(India Vs Pak) అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పాకిస్తాన్ రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, అంతర్గత మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, సాయుధ దళాల అధిపతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
Also Read :India Vs Pak : పాకిస్తానీల వీసాలన్నీ రద్దు.. భారత్ సంచలన నిర్ణయం
పాక్ కీలక నిర్ణయాలివీ..
- భారత్‌కు చెందిన అన్ని విమాన సర్వీసుల కోసం పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాక్ సర్కారు ప్రకటించింది.
- ఇతర దేశాల నుంచి భారత్‌కు, భారత్ నుంచి ఇతర దేశాలకు పాకిస్తాన్ మీదుగా ఎగుమతి, దిగుమతులను ఆపేస్తామని వెల్లడించింది.
- వాఘా బార్డర్ మీదుగా భారత్‌కు వాణిజ్యాన్ని ఆపేస్తామని తెలిపింది.
- భారతీయులకు సార్క్ వీసాల జారీని పాకిస్తాన్ ఆపేసింది.
- పాకిస్తాన్‌లో ఉండేందుకు భారత సైనిక దౌత్యవేత్తలకు ఇచ్చే అనుమతులను పాక్ సర్కారు రద్దు చేసింది.
- పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉండే భారత దౌత్యవేత్తల సంఖ్యను 30కి తగిస్తామని స్పష్టం చేసింది.
Also Read :Miss World 2025: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. పాకిస్తానీ భామలకు షాక్
- సింధూ నదీ జలాల ఒప్పందం అమలును ఆపేస్తున్నట్లు భారత్ చేసిన ప్రకటనను పాకిస్తాన్ సర్కారు ఖండించింది. అది 24 కోట్ల మంది పాకిస్తాన్ పౌరులకు సంబంధించిన అంశమని తెలిపింది.
- సింధూ నదీజలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు ఉద్దేశించిన నీటిని మళ్లించడానికి లేదా ఆపడానికి జరిగే ప్రయత్నాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. అటువంటి చర్యలను తిప్పికొడతామని వెల్లడించింది.