The Hormuz Crisis: మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం)లో నెల రోజులకు పైగా సాగిన యుద్ధం తర్వాత ఇరాన్- అమెరికా మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) జరిగింది. ఈ సీజ్‌ఫైర్ జరగడానికి ప్రధాన కారణం ప్రపంచంలోని అతిపెద్ద జలమార్గాలలో ఒకటైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించడం. అయితే ఇప్పుడు అమెరికా దీనిపై ఒక సంచలన వాదన చేస్తోంది. హోర్ముజ్ జలసంధిలో మందుపాతరలు బిగించిన తర్వాత ఇప్పుడు ఇరాన్ వాటి లోకేషన్లను మర్చిపోయిందని అమెరికా పేర్కొంటోంది. ఇదే నిజమైతే ఇరాన్ అనుకున్నా హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవలేదు.
నేపథ్యం
గత ఫిబ్రవరి 28న అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేశాయి. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా పలువురు కీలక నేతలు, ఉన్నత సైనిక అధికారులు మరణించారు. దీంతో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ప్రతిచర్యగా ఇరాన్ ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీనివల్ల ప్రపంచ దేశాలకు ఎల్‌పీజీ (LPG), ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. జలసంధి మూతపడటంతో ఇబ్బందులు ఎదుర్కొన్న పలు దేశాలు యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశాయి. యుద్ధం ముదురుతున్న క్రమంలో ఇరాన్ చిన్న చిన్న పడవల ద్వారా హోర్ముజ్ జలసంధిలో భారీగా మందుపాతరలను అమర్చింది.
Also Read:Inter Results : రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..!!
అమెరికా వాదన
సీజ్‌ఫైర్ తర్వాత హోర్ముజ్ జలసంధిని కొన్ని నౌకల కోసం మాత్రమే తెరిచారు. జలమార్గంలోని మెజారిటీ భాగం ఇప్పటికీ మూసే ఉంది. దీని వెనుక ఇరాన్ ఇష్టం కంటే సాంకేతిక సమస్యే ఎక్కువగా ఉందని అమెరికా వాదిస్తోంది. మందుపాతరలు ఎక్కడెక్కడ అమర్చారో ఇరాన్‌కే తెలియదని, వాటిని తొలగించే సాంకేతిక సామర్థ్యం కూడా ఆ దేశానికి పరిమితంగానే ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు.
మందుపాతరలను ఎటువంటి ప్రణాళిక లేకుండా ఎక్కడపడితే అక్కడ అమర్చారని, వాటి లోకేషన్లను కూడా సరిగ్గా రికార్డ్ చేయలేదని అమెరికా అంటోంది. పైగా కొన్ని మైన్స్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి స్థానాలు మారి ఉండవచ్చని, దీనివల్ల వాటిని వెతకడం, తొలగించడం మరింత కష్టతరంగా మారిందని పేర్కొంటున్నారు.
అంగీకరించిన ఇరాన్
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘచీ చేసిన ప్రకటనతో అమెరికా వాదనకు బలం చేకూరుతోంది. “సాంకేతిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని జలసంధిని తెరుస్తాం” అని ఆయన పేర్కొన్నారు. అబ్బాస్ చేసిన ఈ వ్యాఖ్యలు మందుపాతరల సమస్య నిజమేనని పరోక్షంగా ధృవీకరిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితి
హోర్ముజ్ జలసంధి చాలా ఇరుకైన మార్గం. మందుపాతరలు ఉండటంతో ప్రస్తుతం చాలా తక్కువ భాగం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే, సీజ్‌ఫైర్ నిబంధనల ప్రకారం హోర్ముజ్ జలసంధిని త్వరగా, సురక్షితంగా పూర్తిగా తెరవాలని అమెరికా ఇరాన్‌కు షరతు విధించింది.
