పాకిస్థాన్‌లోని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హెయిర్ ప్లాంటేషన్ కోసం తన ఉగ్రదాడిని వాయిదా వేసుకున్న ఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ కేసు విచారణలో ఈ విషయం వెలుగు చూడటంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నివ్వెరపోయారు. జమ్ము కశ్మీర్ పోలీసులు గత నెల జరిపిన ఆపరేషన్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు మహమ్మద్ ఉస్మాన్ జాట్, అబు హురెయిరాను అరెస్టు చేసి, దర్యాప్తు కోసం ఎన్ఐఏకు అప్పగించారు.
ఎన్ఐఏ అధికారులు ఇటీవల ఉస్మాన్ జాట్ ను విచారించగా నివ్వెరపోయే విషయం వెలుగు చూసింది. లాహోర్‌కు చెందిన ఉస్మాన్ లష్కరే ఉగ్రవాద సంస్థలో శిక్షణ తీసుకున్నాడు. అనంతరం సరిహద్దు దాటి కశ్మీర్ లోయలోకి జొరబడ్డాడు. జమ్ము కశ్మీర్ వెలుపల స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేసే పనిని తమకు అప్పగించినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ విచారణలో మరో ఆసక్తికర విషయం కూడా వెలుగుచూసింది.
తనకు జుత్తు ఊడిపోవడంతో బట్టతల సమస్యతో బాధపడుతున్నానని, దీంతో తనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని అతను అధికారులకు తెలియజేశాడు. మరో ఉగ్రవాది అబు హురెయిరా సహాయంతో చికిత్స తీసుకున్నట్లు అతడు విచారణలో తెలిపాడు. శ్రీనగర్‌లోని ఒక క్లినిక్‌లో ఉస్మాన్ జాట్ రహస్యంగా హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు. కొన్నిసార్లు రాత్రంతా క్లినిక్‌లోనే ఉన్నట్లు చెప్పాడు.
చికిత్స పూర్తయ్యాక ఉస్మాన్ జాట్ జమ్మూకు చేరుకున్నాడు. అక్కడి నుంచి బస్సులో పంజాబ్ చేరుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఆ తర్వాత అతడు నకిలీ ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్టు కోసం ప్రయత్నించాడు. వాటి సాయంతో దేశం విడిచి పారిపోవాలని ప్రణాళిక వేసుకున్నాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఉత్తర కశ్మీర్, శ్రీనగర్‌లో లష్కరే అనుబంధంగా పనిచేస్తున్న ఓవర్ గ్రౌండ్ వర్కర్ నెట్ వర్క్‌ను పోలీసులు ఛేదించారు.
