Iran Vs Pakistan: ఇరాన్ వర్సెస్ పాకిస్తాన్.. 9 మంది పాకిస్తానీయుల కాల్చివేత

Iran Vs Pakistan:  ఇరాన్- పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది.

  • Written By:
  • Updated On - January 28, 2024 / 08:07 AM IST

Iran Vs Pakistan:  ఇరాన్- పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. ఈ రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడుల వ్యవహారం ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. చివరకు సరిహద్దు ప్రాంతంలో నివసించే  సాధారణ ప్రజల ప్రాణాలను బలి తీసుకునే స్థాయికి ఈ వ్యవహారం చేరుకుంది. తాజాగా ఇరాన్‌లోని(Iran Vs Pakistan) సరావన్ టౌన్‌లో నివసిస్తున్న 9 మంది పాకిస్తానీయులను గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు. వారంతా రోజువారీ కార్మికులు అని తెలుస్తోంది . జీవనోపాధి కోసం వీరంతా పాక్ నుంచి ఇరాన్‌కు వలస వెళ్లారని సమాచారం.  స్థానికంగా ఉండే ఓ కార్ మెకానిక్ షెడ్‌లో ఈ 9 మంది పని చేస్తుండేవారు. సరావన్‌కు చెందిన ఇరాన్ దేశస్తుడు ఒకరు వారిపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించాడు. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు.

మృతుల కుటుంబాలకు పాక్ సంతాపం

ఇరాన్ చోటుచేసుకున్న ఈ  దారుణ వ్యవహారాన్ని ఇరాన్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం కూడా ధ్రువీకరించింది. తమ దేశ పౌరుల మరణాల పట్ల  దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని పాకిస్తాన్ రాయబారి మహ్మద్ ముదస్సిర్ టిపు చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అన్ని విధాలుగా సహకరిస్తామని ఇరాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరణించిన తొమ్మిది మంది మృతదేహాలను  స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

కొద్దిరోజుల కిందటే పాకిస్తాన్‌, ఇరాన్‌లు ఉగ్రవాదల శిబిరాల పేరుతో ఒకదేశంపై మరోదేశం దాడి, ప్రతిదాడి చేసుకున్నాయి.   బలూచిస్తాన్ ప్రాంతంలోని సిస్టాన్‌‌, పంజ్గూర్‌పై ఇరాన్ దాడులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్- ఇరాన్ సరిహద్దులకు ఆనుకుని ఉండే ఈ ప్రాంతం జైష్ అల్ అద్ల్ అనే ఉగ్రవాద సంస్థకు కేంద్రమని ఇరాన్ ఆరోపిస్తోంది. జైష్ అల్ అద్ల్ ఉగ్ర వాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఆనాడు వైమానిక దాడులు చేపట్టింది. డ్రోన్లతో దాడులు చేసింది. మిస్సైళ్లను వేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్‌పై పాక్ ప్రతిదాడులు చేసింది.

Also Read :Telangana Express: హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య తెలంగాణ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ మార్పు

యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కొంతకాలంగా నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.  ఎర్రసముదంలో ఈ దాడుల్ని నిలువరించాలని ఇరాన్‌ను చైనా హెచ్చరించింది. ‘చైనా ప్రయోజనాలకు ఏవిధంగానైనా హాని కలిగితే.. ఆ ప్రభావం టెహ్రాన్‌తో ఉన్న వ్యాపార సంబంధాలపై పడుతుంది. అందుకే సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పండి’ అని డ్రాగన్ చెప్పినట్లు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోన్న వేళ.. నౌకలపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి.