Bashar al Assad : రెబల్స్ దళాలు సిరియా రాజధాని డమస్కస్‌లోకి ఇవాళ తెల్లవారుజామున ప్రవేశించాయి. ఈ పరిణామం జరగడానికి కొన్ని గంటల ముందే డమస్కస్ నుంచి ‘ఇల్యుషిన్ Il-76టీ’ మోడల్ విమానంలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పరారయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన విమానం రాడార్‌లో కనిపించకుండా పోయింది. దీంతో విమానం కూలిపోయిందా ? కూల్చేశారా ? ఏదైనా రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారా ? అనే దానిపై అంతర్జాతీయ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి.
Also Read :Mysterious UFO : అమెరికాలో యూఎఫ్ఓల కలకలం.. ఏలియన్లు దిగి వచ్చాయా ?
‘ఇల్యుషిన్ Il-76టీ’ విమానంలో బషర్ అల్ అసద్ (Bashar al Assad) తొలుత సిరియా తీర ప్రాంతం వైపుగా వెళ్లినట్లు ‘ఫ్లైట్‌రాడార్24.కామ్’లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఆ విమానం సిరియా తీర ప్రాంతం నుంచి అకస్మాత్తుగా మార్గాన్ని మార్చుకొని, వ్యతిరేక దిశలో ప్రయాణించింది. సిరియన్ రెబల్స్ దళాలకు బాగా పట్టున్న హోమ్స్ నగరం వైపుగా వెళ్లిన అసద్ విమానం.. అకస్మాత్తుగా రాడార్‌లో కనిపించకుండా పోయింది. ఆ సమయంలో దాదాపు 3,650 మీటర్ల ఎత్తు నుంచి 1,070 మీటర్లకు ఆ విమానం పడిపోయినట్లు ఫ్లైట్ డేటాను బట్టి తెలిసింది అంటూ కథనాలు వస్తున్నాయి. విమానం ప్రమాదవశాత్తు కూలిందా ? రెబల్స్ కూల్చారా ? అనేది తెలియాల్సి ఉందని ఆ కథనాల్లో ప్రస్తావించారు.
Also Read :Syria Rebels : ‘‘సిరియాలో ఇక కొత్త శకం.. చీకటి కాలాన్ని ముగించాం’’ : సిరియన్ రెబల్స్
అసద్ ప్రయాణించిన విమాన మార్గంలో ఆకస్మిక మార్పు, సిగ్నల్ కోల్పోవడం అనేది అనుమానాలకు తావిస్తోంది. ఆ విమానంలో పాత ట్రాన్స్‌పాండర్లతో పాటు జీపీఎస్ జామింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ఆ కారణం వల్ల విమానం నుంచి రాడార్లకు సరైన సమాచారం అందదని పలువురు అంటున్నారు. బహుశా విమానంలోని ట్రాన్స్‌పాండర్లను స్విచ్ఛాప్ చేసి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బషర్ అల్ అసద్ భార్య, పిల్లల్ని ఇప్పటికే రష్యాకు పంపినట్లు సమాచారం.