Site icon HashtagU Telugu

NATO : నాటోలోకి స్వీడన్ ఎంట్రీ.. ఎందుకో తెలుసా ?

Nato

Nato

NATO : నార్త్ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో స్వీడన్‌ ఎట్టకేలకు చేరింది. దీంతో ఈ కూటమిలోని సభ్యదేశాల సంఖ్య  32కు పెరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి నుంచి ఇప్పటివరకు దశాబ్దాల తరబడి స్వీడన్‌ తటస్థంగా ఉంటూ వచ్చింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగిన తర్వాత ఐరోపాలో ఆందోళన మొదలైంది. ఐరోపా దేశాలపై  రష్యా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో కలవరానికి గురైన స్వీడన్ తమ దేశ రక్షణ కోసం నాటోలో చేరింది. ‘‘స్వీడన్ చేరికతో నాటో కూటమి మరింత బలపడింది. ఇంకా పెద్దదిగా మారింది.  ఇదొక చరిత్రాత్మక క్షణం’’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ పేర్కొన్నారు. నాటోలోకి స్వీడన్  చేరిక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తమ దేశానికి రక్షణ లభించినట్లయిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వీడన్‌ ప్రధానమంత్రి ఉల్ఫ్‌ క్రిస్టెర్సాన్‌ వెల్లడించారు. ఇది చారిత్రక దినమని, స్వేచ్ఛకు లభించిన విజయమన్నారు. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్‌సన్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లు ఈ కార్యక్రమంలో అధికారిక పత్రాలను మార్చుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join

గతేడాది నాటో(NATO) కూటమిలో ఫిన్లాండ్‌ దేశం కూడా చేరింది. రష్యా భయం కారణంగా తాజాగా ఇప్పుడు స్వీడన్‌ కూడా నాటో జాబితాలో చేరింది. గత కొన్నేళ్లుగా నాటోలో చేరేందుకు స్వీడన్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆ ప్రయత్నాలను  టర్కీ, హంగరీ దేశాలు అడ్డుకుంటూ వచ్చాయి. తీవ్రవాదులుగా పరిగణించే కుర్దిష్‌ గ్రూపులకు స్వీడన్‌ ఆశ్రయం కల్పిస్తోందని టర్కీ ఆరోపించింది. అయితే అమెరికా చొరవ చూపి టర్కీ, హంగరీలను ఒప్పించి.. నాటోలో స్వీడన్ చేరేందుకు లైన్ క్లియర్ చేసింది.

Also Read : Govt OTT : ఓటీటీ యాప్ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

Also Read :Political Entry : 15న వైఎస్ సునీతారెడ్డి సంచలన ప్రకటన..?