Suicide Attack : పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మరోసారి పాక్ ఆర్మీపై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి జరిగింది. పాకిస్తాన్‌లోని ఖైబర్ పంఖ్తూఖ్వా ప్రావిన్స్ పరిధిలోని బన్నూ నగరం శివార్లలో ఉన్న మాలీ ఖేల్ ఆర్మీ చెక్ పాయింట్ వద్ద ఓ సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో అక్కడే విధుల్లో ఉన్న దాదాపు 10 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఏడుగురు సైనికులకు తీవ్ర గాయాల య్యాయి. దీంతో వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ సూసైడ్ దాడి(Suicide Attack) వల్ల మాలీ ఖేల్ ఆర్మీ చెక్ పాయింట్ నిర్మాణం తీవ్రంగా దెబ్బతింది. అక్కడి మిలిటరీ వాహనాలు కూడా ధ్వంస మయ్యాయి. ఈ దాడిని తామే చేశామని ‘హఫీజ్ గుల్ బహదూర్’ అనే మిలిటెంట్ సంస్థ ప్రకటించింది.
Also Read :Kiara Advani : 2025 కియరా అద్వాని.. మోత మోగించేస్తుందా..?
అంతకుముందు ఏమైందంటే..
అంతకుముందు సోమవారం రోజు ఖైబర్ పంఖ్తూఖ్వా ప్రావిన్స్‌లోనే ఉన్న తిరా అనే ఏరియాలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 8 మంది సైనికులు, 9 మంది మిలిటెంట్లు చనిపోయారు. తిరా ఏరియాలో సైనికులను చంపింది తామేనని తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) సంస్థ ప్రకటించింది. దీంతోపాటు సోమవారం రోజు బన్నూ చెక్ పాయింట్ వద్ద విధులు నిర్వర్తించే ఏడుగురు పోలీసు సిబ్బందిని మిలిటెంట్లు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాయి. అయితే స్థానిక మత పెద్దల రాయబారం నడిపి పోలీసు సిబ్బందిని మిలిటెంట్ల చెర నుంచి విడిపించారు. ఈ పరిణామాలు చోటుచేసుకున్న తర్వాత కొన్ని గంటల్లోనే బన్నూ చెక్ పాయింట్ వద్దనున్న సైనికులు లక్ష్యంగా సూసైడ్ దాడి జరగడం గమనార్హం.
Also Read :Viswak Sen : విజయ్ సేతుపతి మహారాజపై విశ్వక్ సేన్ కామెంట్..!
తాలిబన్ల మద్దతు.. ?
‘హఫీజ్ గుల్ బహదూర్’, టీటీపీ.. ఇది రెండూ వేర్వేరు మిలిటెంట్ సంస్థలు. ఇవి రెండు కూడా గతంలో 20 ఏళ్ల పాటు అమెరికాపై తాలిబన్ల పోరాటానికి మద్దతు ఇచ్చాయి. 2021 సంవత్సరంలో తాలిబన్లు తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి పాకిస్తాన్ బార్డర్ ఏరియాలలో టీటీపీ ఉగ్ర కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయి. పాకిస్తాన్‌లోని చాలాచోట్ల జరిగిన దాడుల వెనుక టీటీపీ పేరు వినిపిస్తోంది.