Sunita Williams : భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్‌లు 8 రోజుల స్పేస్ మిషన్ కోసం వెళ్లి దాదాపు 9 నెలల పాటు అక్కడే ఇరుక్కుపోయారు. ఇంత సుదీర్ఘ కాలం పాటు వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే గడిపారు. వారిని భూమికి తీసుకొచ్చేందుకు గత శుక్రవారం రోజు అమెరికా నుంచి వెళ్లిన ‘నాసా-స్పేస్ ఎక్స్’ సంయుక్త ‘క్రూ-10 మిషన్’ ఐఎస్ఎస్‌కు ఇవాళ చేరుకుంది. అందులోని వ్యోమగాములు.. ఐఎస్ఎస్‌లోని సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తీసుకొని మార్చి 19కల్లా అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ కానున్నారు. 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపినందుకు వివిధ ఆరోగ్య సమస్యలు సునితను చుట్టుముట్టాయట. ఆమె భూమికి తిరిగొచ్చాక ఆ సైడ్ ఎఫెక్టులు కనిపిస్తాయట. వివరాలివీ..
Also Read :Saudi Arabia T20 : గ్రాండ్ శ్లామ్ తరహాలో టీ20 లీగ్.. రూ.4,300 కోట్లతో సౌదీ రెడీ
సునితకు బేబీ ఫుట్.. ఏమిటిది ?
- సునితా విలియమ్స్(Sunita Williams) మార్చి 19న భూమికి తిరిగొచ్చాక “బేబీ ఫుట్” సమస్య తలెత్తే రిస్క్ ఉంది.
- సునిత 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపారు. నేలపై కాలు పెట్టలేదు. అందుకే భూమిపైకి తిరిగొచ్చాక, నడిచేందుకు ఆమె తడబడే అవకాశం ఉంది. నేలపై అడుగు మోపేందుకు పాదాలు మునుపటిలా ఈజీగా సహకరించకపోవచ్చు.
- అంతరిక్షంలో సుదీర్ఘకాలం ఉంటే బేబీ ఫుట్ సమస్య వస్తుంది. దీనివల్ల పాదాలు.. శిశువు పాదాలలాగా మృదువుగా మారుతాయి. వాటితో నడవడం కష్టంగా అనిపిస్తుంది.
- భూమిపై నడుస్తున్నప్పుడు.. మన పాదాలు గురుత్వాకర్షణ, ఘర్షణ రూపంలో చాలా నిరోధకతను ఎదుర్కొంటాయి. ఫలితంగా మన అరికాళ్లపై ఉండే చర్మం మందంగా తయారవుతుంది. అవి మనకు అసౌకర్యం, నొప్పి నుంచి రక్షణ కల్పిస్తాయి.
- నెలల తరబడి అంతరిక్షంలో గడిపితే అరికాళ్లపై ఉండే గట్టి చర్మం తొలగిపోతుంది. ఫలితంగా పాదాలు మృదువుగా మారుతాయి. అరికాళ్లపై గట్టి చర్మం వచ్చేందుకు కొన్ని వారాల నుంచి నెలల టైం పడుతుంది.
- పరిస్థితి మెరుగుపడే వరకు సునితా విలియమ్స్2కు నడక అసౌకర్యంగా, బాధ కలిగించేదిగా ఉంటుంది.
మరిన్ని ఆరోగ్య సమస్యలు ఇవీ..
- అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు. దీర్ఘకాలం అక్కడ ఉండటం వల్ల వ్యోమగాముల ఎముకల సాంద్రత గణనీయంగా తగ్గుతుంది.
- కండరాలు బలహీనపడతాయి.
- వ్యోమగాముల శరీరంలో రక్తం మోతాదు కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే వారి శరీరంలోని గుండె గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా రక్తాన్ని పంప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా గుండె చాలా తక్కువగా కష్టపడాల్సి వస్తుంది.
- వ్యోమగాముల శరీరంలో రక్తం ప్రవహించే విధానం కూడా మారుతుంది.
- శరీరంలోని ద్రవాలు పేరుకుపోయి కనుబొమ్మల ఆకారం మారుతుంది. కంటిచూపు బలహీనపడుతుంది. చాలా మంది వ్యోమగాములు అంతరిక్షంలో కళ్ళజోడు ధరించి కనిపించడానికి ఇదే కారణం.
- అంతరిక్షంలో సుదీర్ఘ కాలం గడపడం వల్ల వ్యోమగాములపై రేడియేషన్ ప్రభావం ఉంటుంది. భూమి అయస్కాంత క్షేత్రంలో చిక్కుకున్న కణాలు, సూర్యుడి నుంచి వచ్చే సౌర అయస్కాంత కణాలు, గెలాక్సీ కాస్మిక్ కిరణాల ప్రభావం వ్యోమగాములపై ఉంటుంది.